Kodiguddu Vepudu : కోడిగుడ్లతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్లతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. కోడిగుడ్డుతో చేసుకోదగిన వంటకాల్లో కోడిగుడ్డు ఫ్రై కూడా ఒకటి. కోడిగుడ్డు ఫ్రైను అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కోడిగుడ్డు ఫ్రైను రకరకాల రుచుల్లో తయారు చేస్తూ ఉంటారు. ఎలా చేసినా కూడా ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. రుచిగా, సులభంగా ఈ కోడిగుడ్డు ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 5, నూనె – 5 టీ స్పూన్స్, కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, జీలకర్ర – పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2 ( పెద్దవి), చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఎగ్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చివేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు సగంకు పైగా వేగిన తరువాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత ఉప్పు, కారం వేసి వేయించాలి. తరువాత కోడిగుడ్లను వేసి కదిలించకుండ మూత పెట్టి వేయించుకోవాలి. కోడిగుడ్డు ఒక వైపు వేగిన తరువాత నెమ్మదిగా మరో వైపుకు తిప్పుకోవాలి. దీనిపై మరలా మూత పెట్టి వేయించాలి.
కోడిగుడ్డు రెండు వైపులా వేగిన తరువాత మనకు నచ్చిన రీతిలో ముక్కలుగా చేసుకోవచ్చు. తరువాత మిరియాల పొడి, గరం మసాలా వేసి కలిపి వేయించాలి. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు చపాతీ, రోటీ వంటి వాటితో కూడా ఈ ఫ్రైను తినవచ్చు. వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా రుచిగా ఎగ్ ఫ్రైను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.