Konaseema Kodi Pulao : కోడి పులావ్ ను మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. రెస్టారెంట్ లలో తినడంతో పాటు దీనిని మనం ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటాము. అలాగే ఈ పులావ్ ను ఒక్కొక్కరు ఒక్కో పద్దతిలో తయారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా కింద చెప్పిన విధంగా చేసే కోనసీమ కోడి పులావ్ కూడా చాలా రుచిగా ఉంటుంది. కోనసీమ స్పెషల్ అయిన ఈ కోడి పులావ్ ను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా వెరైటీగా కోడి పులావ్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా ఉండదు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ కోనసీమ కోడి పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి ముక్కలు – 3 కప్పులు, నూనె – 6 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు – 1, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – 2 టీ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 4, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చికెన్ – కిలో, కారం – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, నిమ్మరసం – అర చెక్క.
ధనియాలు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, సోంపు -అర టీ స్పూన్, మిరియాలు -ఒక టీ స్పూన్, నల్ల యాలకులు – 2, స్టోన్ ప్లవర్ – కొద్దిగా, మరాఠీ మొగ్గలు – 4, లవంగాలు – 6, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, అనాస పువ్వు – 1, జాపత్రి – కొద్దిగా, యాలకులు – 6.
నూనె – 3 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకులు – 2, దాల్చిన చెక్క – చిన్న ముక్క, మరాఠీ మొగ్గలు – 2, అనాస పువ్వు – 1, సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, నానబెట్టిన బాస్మతీ బియ్యం – 4 కప్పులు.
ముందుగా గిన్నెలో చికెన్ ను తీసుకోవాలి. తరువాత మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు వేసి కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో మసాలా పొడికి కావల్సిన పదార్థాలు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా పొడిగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత జార్ లో కొబ్బరి ముక్కలు తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని చిక్కటి పాలను తీసుకోవాలి. తరువాత ఈ కొబ్బరిని మరలా జార్ లో వేసి మరో 6 కప్పుల నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని మరో గిన్నెలోకి పూర్తిగా పాలను తీసుకోవాలి. తరువాత కళాయిలో చికెన్ ను వండడానికి నూనె వేసి వేడి చేయాలి. తరువాత బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
ఇవి వేగిన తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. తరువాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి కలపాలి. దీనిని 3 నిమిషాల పాటు పెద్ద మంటపై ఉడికించిన తరువాత మంటను మధ్యస్థంగా చేసి ముందుగా తయారు చేసుకున్న చిక్కటి కొబ్బరి పాలు పోసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత పచ్చిమిర్చి, కొత్తిమీర వేసికలపాలి. తరువాత మసాలా పొడి నుండి 2 టీ స్పూన్ల పొడిని పక్కకు తీసి మిగిలిన పొడిని కూరలో వేసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ మెత్తగా ఉడికే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత అన్నం కోసం గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి సగానికి పైగా వేగిన తరువాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి వేయించాలి.
ఇవన్నీ చక్కగా వేగిన తరువాత ముందుగా తయారు చేసుకున్న 6 కప్పుల కొబ్బరి పాలు, ఉప్పు వేసి కలపాలి. పాలు మరిగిన తరువాత నానబెట్టుకున్న బియ్యం వేసి కలపాలి. దీనిపైమూత పెట్టి మధ్యస్థ మటంపై అన్నం దగ్గర పడే వరకు ఉడికించాలి. తరువాత ఈ గిన్నెను పెనం మీద ఉంచి మంటను చిన్నగా చేసి 10 నుండి 15 నిమిషాల పాటు ధమ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి మరో 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత అన్నాన్ని వేడి వేడిగా చికెన్ కర్రీతో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కోనసీమ కోడి పులావ్ తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన పులావ్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.