Curry Leaves Water : కరివేపాకు.. ఇది మనందరికి తెలిసిందే. వంటల్లో దీనిని విరివిగా వాడుతూ ఉంటాము. అసలు కరివేపాకు వేయకుండా మనం వంటలను తయారు చేయమనే చెప్పవచ్చు. వంటలల్లో కరివేపాకును వేయడం వల్ల వంటల రుచి, వాసన పెరగడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. కరివేపాకులో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కరివేపాకును తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చన్న సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే ఈ కరివేపాకును వంటల్లో వేయడానికి బదులగా కరివేపాకు నీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకు నీటిని తాగడం వల్ల దీనిలో ఉండే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు నేరుగా శరీరానికి అందడంతో పాటు మరింత ఎక్కువగా అందుతాయి.
ఈ నీటిని తయారు చేయడం చాలా సులభం. కరివేపాకు నీటిని ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే ఈ నీటిని తాగడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కరివేపాకు నీటిని తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ నీటిలో రెండు రెమ్మల కరివేపాకు వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిని మరిగించి వడకట్టి తాగాలి. ఇలా కరివేపాకు నీటిని తయారు చేసుకుని తాగడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. శరీరం శుభ్రపడుతుంది. అలాగే శరీరంలో రోగని రోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. అలాగే కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడడంలో సహాయపడతాయి.
అదే విధంగా కరివేపాకులో ఆల్కలాయిడ్స్, గ్లైకోసైడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మనల్ని వ్యాధలు బారిన పడకుండా కాపాడడంలో దోహదపడతాయి. కరివేపాకు నీటిని తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రై గ్లిజరాయిడ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. ఇక కరివేపాకు నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రేగు కదలికలు చురుకుగా ఉంటాయి. అంతేకాకుండా కరివేపాకు నీటిని తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కరివేపాకు యొక్క చక్కటి వాసన శరీరంపైసానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే కండరాలకు, నరాలకు విశ్రాంతి లభిస్తుంది. శరీర బడలిక తగ్గుతుంది. ఈ విధంగా కరివేపాకు నీరు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఈ నీటిని రోజూ తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.