Korrala Pongal : మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో కొర్రలు ఒకటి. కొర్రలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. కొర్రలను ఆహారంగా తీసుకోవడం వల్ల నాడీ మండల వ్యవస్థ చురుకుగా పని చేస్తుంది. ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలు బలంగా తయారవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో కూడా కొర్రలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ కొర్రలతో మనం ఉప్మా, అన్నం, కిచిడి వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. వీటితో పాటు కొర్రలతో మనం ఎంతో రుచిగా ఉండే పొంగల్ ను కూడా తయారు చేసుకోవచ్చు. కొర్రలతో చేసే పొంగలి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎంతో రుచిగా ఉండే కొర్రల పొంగలిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొర్రల పొంగలి తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – ఒక కప్పు, రాత్రంతా నానబెట్టిన కొర్రలు – ఒక కప్పు, ఉప్పు – తగినంత,, నీళ్లు – 4 కప్పులు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, జీడిపప్పు – గుప్పెడు, తరిగిన పచ్చిమిర్చి -3, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, ఇంగువ – రెండు చిటికెలు.
కొర్రల పొంగలి తయారీ విధానం..
ముందుగా కళాయిలో పెసరపప్పు వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. తరువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత ఈ పప్పును కుక్కర్ లో వేసుకోవాలి. ఇందులోనే నానబెట్టుకున్న కొర్రలను, ఉప్పు, నీళ్లు పోసి మూత పెట్టాలి. దీనిని మధ్యస్థ మంటపై 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత తాళింపును ముందుగా ఉడికించుకున్న పొంగలిలో వేసి కలపాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొర్రల పొంగలి తయారవుతుంది. దీనిని మనం అల్పాహారంగా లేదా సాయంత్రం భోజనంగా ఎలా తినవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు ఈ విధంగా కొర్రలతో పొంగలిని తయారు చేసుకుని తినడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. కొర్రలతో చేసిన ఈ పొంగలిని తినడం వల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. దీనిని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.