Korrala Upma : ప్రస్తుత తరుణంలో చాలా మంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే ఆహారం పరంగా అనేక మార్పులు చేసుకుంటున్నారు. తెల్ల అన్నానికి బదులుగా చిరు ధాన్యాలను అధికంగా తింటున్నారు. వీటితో అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చని చెబుతుండడంతోనే చాలా మంది చిరు ధాన్యాలను తింటున్నారు. అయితే చిరుధాన్యాల్లో కొర్రలు కూడా ఒకటి. ఇవి బీపీ, షుగర్, బరువును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. కానీ వీటిని ఎలా వండాలో చాలా మందికి తెలియదు. నేరుగా తినలేరు. అయితే కొర్రలతో ఉప్మా చేస్తే.. చాగా బాగుంటుంది. దీన్ని ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. ఇక కొర్రలతో ఉప్మాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొర్రల ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
కొర్రలు – ఒక కప్పు, నీళ్లు – రెండున్నర కప్పులు, ఆవాలు – అర టీస్పూన్, మినప పప్పు – ఒక టీస్పూన్, శనగ పప్పు – ఒక టీస్పూన్, ఉల్లిపాయ – ఒకటి, టమాటా – ఒకటి, పచ్చి మిర్చి – రెండు, కరివేపాకు రెబ్బలు – రెండు, అల్లం తరుగు – ఒక టీస్పూన్, క్యారెట్ – ఒకటి, బీన్స్ – 5, పచ్చి బఠానీ – పావు కప్పు, పసుపు – పావు టీస్పూన్, నూనె – మూడు పెద్ద టీస్పూన్లు, ఉప్పు – తగినంత, కొత్తిమీర – ఒక కట్ట, కొబ్బరి తురుము – పావు కప్పు.
కొర్రల ఉప్మాను తయారు చేసే విధానం..
కొర్రల్ని రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి. కుక్కర్‌లో నూనె వేసి ఆవాలు, శనగ పప్పు, మినపప్పు వేయించుకుని కరివేపాకు, పచ్చి మిర్చి, అల్లం తరుగు వేసి వేయించాలి. ఆ తరువాత ఉల్లిపాయ తరుగు, టమాటా ముక్కలు, క్యారెట్ తురుము, బీన్స్ ముక్కలు, పచ్చి బఠానీలను వేసి బాగా వేయించి పసుపు, కొర్రలు, తగినంత ఉప్పు, నీళ్లు పోసి మూత పెట్టాలి. రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆ తరువాత కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపితే చాలు. కొర్రల ఉప్మా రెడీ అవుతుంది. దీన్ని ఏదైనా చట్నీలో తింటే రుచి అమోఘంగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరం కూడా.