Kura Karam : మనం వంటల్లో సాధారణ కారంతో పాటు కూర కారాన్ని కూడా వేస్తూ ఉంటాము. దీనినే సాంబార్ కారం అని కూడా అంటారు. చాలా మందిఈ కారాన్ని ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని సంవత్సరమంతా వాడుతూ ఉంటారు. కూర కారాన్ని కూరలల్లో, వేపుళ్లల్లో దేనిలోనైనా వేసుకోవచ్చు. కూర కారం వేసి చేయడం వల్ల వంటలు చాలా రుచిగా ఉంటాయి. ఈ కూర కారాన్ని తయారు చేయడం చాలా తేలిక. ఎవరైనా చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే సంవత్సరమంతా వాడుకోవచ్చు. వంటలకు మరింత కమ్మటి రుచిని అందించే ఈ కూర కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కూర కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండుమిర్చి – 400 గ్రా., కాశ్మీరి చిల్లీ – 100 గ్రా., శనగపప్పు – 25 గ్రా., మినపప్పు – 25 గ్రా., ధనియాలు – 25 గ్రా., జీలకర్ర – 10 గ్రా., పసుపు కొమ్మలు – 4, మెంతులు – 15 గ్రా., ఉప్పు – 50 గ్రా., కరివేపాకు – 10 గ్రా., పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు – 50 గ్రా.,ఆముదం – 2 టేబుల్ స్పూన్స్.
కూర కారం తయారీ విధానం..
ముందుగా ఎండుమిర్చిని తొడిమలు తీసేసి శుభ్రంగా తుడుచుకోవాలి. తరువాత వీటిని కళాయిలో వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని వస్త్రంపై వేసి ఎండలో ఆరబెట్టాలి. తరువాత కళాయిలో శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి.తరువాత పసుపు కొమ్ములు, ఉప్పు, మెంతులు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు వేసి కరకరలాడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని వీటిని కూడా ఎండలో ఎండబెట్టాలి.
తరువాత వెల్లుల్లి రెబ్బలను కూడా ఎండలో ఉంచి ఎండబెట్టాలి. వీటిని ఒక రోజంతా ఎండబెట్టిన తరువాత ఎండుమిర్చిని, వేయించిన మసాలా దినుసులను గిర్రిలో వేసి మర ఆడించాలి. తరువాత ఒక జార్ లో వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుని కారంలో వేసి కలపాలి. తరువాత ఆముదాన్ని కూడా వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. దీనిని గాలి తగలకుండానిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూర కారం తయారవుతుంది. దీనిని వంటలల్లో వేయడం వల్ల వంటలు మరింత రుచిగా ఉంటాయి.