Lasuni Methi : మనకు రెస్టారెంట్ లలో, హోటల్స్ లో లభించే పదార్థాల్లో లసూని మేతి కూడా ఒకటి. మెంతికూరతో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అలాగే ఈ కూర దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ ఈమ లసుని మేతిని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. ఎవరైనా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే లసుని మేతిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
లసుని మేతి తయారీకి కావల్సిన పదార్థాలు..
మెంతిఆకులు – 3 కప్పులు, పల్లీలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్, శనగపిండి – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్,తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 6, తరిగిన పచ్చిమిర్చి – 5, ఉప్పు – తగినంత, బటర్ – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, అల్లం తురుము – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు -అర కప్పు, తరిగిన టమాటాలు – అర కప్పు, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, నీళ్లు – ముప్పావు కప్పు.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
బటర్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 4, జీలకర్ర – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కారం – అర టీ స్పూన్.
లసుని మేతి తయారీ విధానం..
ముందుగా మెంతిఆకులను శుభ్రంగా కడిగి చిన్నగా తరగాలి. తరువాత కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత శనగపిండి వేసి వేయించాలి. తరువాత నువ్వులు కడా వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తరువాత మెత్తని పొడిలా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత తరిగిన మెంతిఆకు వేసి 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత మరో కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె, బటర్ వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు, పసుపు వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి వేసి కలపాలి. ఈ మసాలాలు మాడిపోకండా కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. మసాలాలు చక్కగా వేగిన తరువాత అర కప్పు నుండి ముప్పావు కప్పు నీళ్లు పోసి కలపాలి. నీరు ఉడుకు పట్టిన తరువాత వేయించిన మెంతిఆకు వేసి కలపాలి.
దీనిని మరో 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో తాళింపుకు బటర్ వేసి వేడి చేయాలి.తరువాత వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి కారం వేసి కలపాలి. ఈ తాళింపును ముందుగా తయారు చేసుకున్న కూరలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల లసూని మేతి తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పుల్కా, నాన్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈవిధంగా మెంతికూరతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు.