Mango Bobbatlu : మామిడి పండ్లను అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మామిడి పండ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. వీటిని నేరుగా తినడంతో పాటు వీటితో జ్యూస్, మిల్క్ షేక్, కప్ కేక్స్ ఇలా రకరకాల వెరైటీలను కూడా తయారు చేస్తూ ఉంటాము. అలాగే ఈ మామిడి పండ్లతో మనం ఎంతో రుచిగా ఉండే బొబ్బట్లను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ మామిడి పండ్ల బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడి బొబ్బట్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – 2 కప్పులు, ఉప్పు -చిటికెడు, పసుపు – చిటికెడు, తియ్యటి మామిడి పండ్లు – పెద్దవి మూడు, శనగపిండి – పావు కప్పు, బెల్లం తురుము – పావు కప్పు, యాలకుల పొడి – ఒక టీ స్పూన్.
మామిడి బొబ్బట్లు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండి, ఉప్పు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత 5 లేదా 6 టీ స్పూన్ల నూనె వేసి మరో 8 నిమిషాల పాటు కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి పిండిని పక్కకు ఉంచాలి. తరువాత జార్ లో మామిడి పండ్ల గుజ్జును వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో 6 టీ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి.నెయ్యి వేడయ్యాక శనగపిండిని వేసి వేయించాలి. శనగపిండిని కొద్దిగా రంగు మారే వరకు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న మామిడిపండు గుజ్జు వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం దగ్గర పడిన తరువాత బెల్లం వేసి కలపాలి. బెల్లం కరిగిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలుపుతూ పూర్తిగా దగ్గర పడి ముద్దలా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు అరటి ఆకు లేదా బటర్ పేపర్ ను తీసుకుని దానిపై నూనె రాయాలి. తరువాత ముందుగా సిద్దం చేసుకున్న పిండిని తీసుకుని చేతులకు నూనె రాసుకుంటూ వత్తుకోవాలి. తరువాత ఇందులో ముందుగా తయారు చేసిన మామిడిపండు మిశ్రమాన్ని ఉంచి అంచులను మూసివేయాలి. తరువాత దీనిపై ప్లాస్టిక్ కవర్ ను ఉంచి చేత్తో బొబ్బట్టు లాగా వత్తుకోవాలి. తరువాత స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక నెమ్మదిగా బొబ్బట్టును పెనం మీద వేసుకోవాలి. తరువాత నూనె లేదా నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మామిడి బొబ్బట్లు తయారవుతాయి. వీటిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. మామిడి పండ్లు లభించే ఈ సీజన్ లో ఇలా బొబ్బట్లను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.