మనం బ్రెడ్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బ్రెడ్ ను నేరుగా తినడమే కాకుండా దీంతో వివిధ రకాల వంటలను, తీపి పదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. బ్రెడ్ తో రుచిగా, తక్కువ సమయంలో, సులభంగా చేసుకోదగిన తీపి వంటకాల్లో బ్రెడ్ రస్ మలై కూడా ఒకటి. బ్రెడ్ రస్ మలైను ఏవిధంగా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ రస్ మలై తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెడ్ స్లైసెస్ – 4, చిక్కని పాలు – అర లీటర్, పంచదార – 2 టేబుల్ స్పూన్ప్ లేదా తగినంత, యాలకుల పొడి – పావు టీ స్పూన్, ఎల్లో ఫుడ్ కలర్ – చిటికెడు, తరిగిన బాదం పప్పు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పిస్తా – ఒక టేబుల్ స్పూన్, తరిగిన జీడిపప్పు – ఒక టేబుల్ స్పూన్.
బ్రెడ్ రస్ మలై తయారీ విధానం..
ఈ వంటకాన్ని తయారు చేయడానికి గాను బ్రెడ్ అంచులను కాకుండా మధ్యలో తెల్లగా ఉండే భాగాన్ని మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అంచు పదునుగా ఉన్న గ్లాస్ కానీ గిన్నెను కానీ లేదా కట్టర్ కానీ తీసుకుని మనకు కావల్సిన ఆకారంలో బ్రెడ్ ను కట్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పాలను పోసి అవి సగం అయ్యే వరకు కలుపుతూ మరిగించాలి. తరువాత పంచదారను వేసి అది కరిగే వరకు కలపాలి.
తరువాత ఫుడ్ కలర్ ను, యాలకుల పొడిని వేసి కలపాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసి కలిపి పాలు మరికొద్దిగా దగ్గరయ్యే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ పాలను చల్లగా అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో లేదా ప్లేట్ లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను ఉంచి వాటిపై చల్లగా చేసుకున్న పాల మిశ్రమాన్ని పోసి 5 నిమిషాల పాటు నాననివ్వాలి. తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని తినాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ రస్ మలై తయారవుతుంది.
దీనిని అదే విధంగా తినవచ్చు లేదా ఫ్రిజ్ లో పెట్టుకుని చల్లగా అయిన తరువాత కూడా తినవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు బ్రెడ్ తో ఈ విధంగా చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో, రుచిగా రస్ మలైను చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. వంటరాని వారు కూడా ఈ బ్రెడ్ రస్ మలై ను చాలా సులభంగా తయారు చేయవచ్చు.