Chicken Vada : మనం వంటింట్లో అనేక రకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. మనం సాయంత్రం సమయాలలో తినడానికి చేసుకునే చిరుతిళ్లల్లో వడలు కూడా ఒకటి. మనం మసాలా వడ, సగ్గు బియ్యం వడ, అటుకుల వడ ఇలా రకరకాల వడలను తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా మనం చికెన్ తో కూడా వడలను తయారు చేసుకోవచ్చు. చికెన్ తో చేసే వడలు కూడా చాలా రుచిగా ఉంటాయి. చికెన్ తో వడలను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన శనగ పప్పు – ఒక కప్పు, బోన్ లెస్ చికెన్ – 150 గ్రాములు, చిన్నగా తరిగిన పచ్చి మిరపకాయలు – 3, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1 (మధ్యస్థంగా ఉన్నది), తరిగిన కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, గరంమసాలా – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, బియ్యం పిండి – 2 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
చికెన్ వడ తయారీ విధానం..
ముందుగా నానబెట్టిన శనగ పప్పును శుభ్రంగా కడిగి ఒక జార్ లోకి తీసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే జార్ లో బోన్ లెస్ చికెన్ ను వేసి దీనిని కూడా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని అదే గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తరువాత అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నూనె రాసిన పాలిథీన్ కవర్ పై ఉంచి వడ ఆకారంలో వత్తుకోవాలి.
ఈ వడలను మరీ పలుచగా కాకుండా, మరీ మందంగా కాకుండా వత్తుకుని నూనెలో వేసి మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని టిష్యూ ఉంచిన పేపర్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ వడలు తయారవుతాయి. ఈ వడల తయారీలో చికెన్ ను మిక్సీ పట్టుకోవడానికి బదులుగా చికెన్ కీమాను కూడా ఉపయోగించవచ్చు. ఇలా చికెన్ తో తరచూ చేసే వంటకాలకు బదులుగా ఇలా వడలు చేసుకుని సాయంత్రం సమయాలలో స్నాక్స్ గా తినవచ్చు. ఉల్లిపాయ, నిమ్మరసంతో కలిపి తింటే ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి.