Fruit Custard : ఫ్రూట్ కస్టర్డ్.. పండ్లతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. చల్ల చల్లగా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. మనకు ఎక్కువగా ఫంక్షన్ లలో దీనిని సర్వ్ చేస్తూ ఉంటారు. అలాగే చాలా మంది దీనిని ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటారు. ఫ్రూట్ కస్టర్డ్ ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. చల్ల చల్లగా తియ్యగా రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు దీనిని తయారు చేసి తీసుకోవచ్చు. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ ఫ్రూట్ కస్టర్డ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రూట్ కస్టర్డ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కస్టర్డ్ పౌడర్ – 2 టీ స్పూన్స్, పాలు – అరలీటర్, పంచదార – 4 టేబుల్ స్పూన్స్ లేదా తగినంత, తరిగిన అరటిపండు – 1, తరిగిన ఆపిల్ – 1, దానిమ్మ గింజలు – అర కప్పు, తరిగిన ద్రాక్ష పండ్లు – ఒక కప్పు.
ఫ్రూట్ కస్టర్డ్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో కస్టర్డ్ పౌడర్ ను తీసుకుని అందులో కొద్దిగా పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో లేదా గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి. పాలు మరిగిన తరువాత పంచదార వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత ముందుగా తయారు చేసిన కస్టర్డ్ పౌడర్ వేసి కలపాలి. దీనిని కొద్దిగా చిక్కబడే వరకు కలుపుతూ ఉడికించాలి. కస్టర్డ్ దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని కలుపుతూ చల్లారబెట్టాలి. కస్టర్డ్ చల్లారిన తరువాత ఇందులో పండ్ల ముక్కలను వేసుకోవాలి. వీటితో పాటు మనకు నచ్చిన ఇతర పండ్ల ముక్కలను కూడా వేసుకోవచ్చు. అంతా కలిసేలా కలుపుకున్న తరువాత దీనిపై మూత పెట్టి 2 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ తయారవుతుంది. దీనిని పిల్లలతో పాటు ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.