Guddu Karam : మన శరీరానికి మేలు చేసే ఆహార పదార్థాల్లో కోడిగుడ్లు కూడా ఒకటి. వీటిని తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కండపుష్టికి, దేహదారుఢ్యం కోసం వ్యాయామాలు చేసే వారికి ఇవి చక్కటి ఆహారం అని చెప్పవచ్చు. అలాగే వీటితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా చాలా తక్కువ సమయంలో అయిపోయేలా అదే విధంగా రుచిగా ఉండేలా గుడ్డు కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్డుకారం తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 4, లవంగాలు – 3, యాలకులు – 2, దాల్చిన చెక్క ముక్క – 1, ధనియాలు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – 2 టీ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 4, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ – 1 (మధ్యస్థంగా ఉన్నది), నూనె – 3 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 3, కరివేపాకు – ఒక రెబ్బ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
గుడ్డుకారం తయారీ విధానం..
ముందుగా ఉడికించిన కోడిగుడ్లపై పొట్టును తీసి వాటికి గాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో లవంగాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుకొబ్బరి ముక్కలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి చిన్న మంటపై వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత నువ్వులను కూడా వేసి వేయించుకుని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఈ దినుసులు చల్లగా అయిన తరువాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు, పసుపు వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే జార్ లో ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత గాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను వేయాలి. ఇందులోనే చిటికెడు ఉప్పు, కారం, పసుపు వేసి రంగు మారే వరకు వేయించుకుని పక్కకు తీసుకోవాలి. అదే నూనెలో పచ్చిమిర్చి ముక్కలను, కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.
తరువాత వేయించిన కోడిగుడ్లను, మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత మూత తీసి కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గుడ్డు కారం తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా గుడ్డు కారాన్ని చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా తయారు చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ విధంగా తయారు చేసిన గుడ్డు కారాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.