Kalakand : పాలతో మనం రకరకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. పాలతో చేయదగిన తీపి పదార్థాల్లో కలాకంద్ కూడా ఒకటి. ఇది ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అయితే కలాకంద్ ను తయారు చేయడం చాలా సమయం అలాగే శ్రమతో కూడుకున్న పని. ఈ కలాకంద్ ను మనం చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు. రుచిగా చాలా తక్కువ సమయంలో అయ్యేలా కలాకంద్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కలాకంద్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చిపాలు – ఒక కప్పు, పంచదార – అర కప్పు, పాలపొడి – రెండున్నర కప్పులు, నెయ్యి – పావు కప్పు, యాలకుల పొడి – ఒక టీ స్పూన్.
కలాకంద్ తయారీ విధానం..
ఈ తీపి పదార్థాన్ని తయారు చేసుకోవడానికి గాను ముందుగా అడుగు మందంగా లోతుగా ఉండే కళాయిని తీసుకోవాలి. తరువాత అందులో యాలకుల పొడి తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. తరువాత దీనిని స్టవ్ మీద ఉంచి వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని మధ్యస్థ మంటపై అడుగు భాగం మాడకుండా 15 నుండి 20 నిమిషాల పాటు కలుపుతూ వేడి చేయాలి. ఇలా చేయడం వల్ల కలాకంద్ రంగు మారడంతోపాటు దగ్గరగా కూడా అవుతుంది.
కలాకంద్ కళాయికి అంటుకోకుండా వేరు అవుతున్నప్పుడు యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కలాకంద్ ను నెయ్యి రాసిన లేదా బటర్ పేపర్ ఉంచిన ఒక గిన్నెలోకి తీసుకుని పై భాగం అంతా సమానంగా చేసుకోవాలి. తరువాత దానిపై మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ను ముక్కలుగా చేసి చల్లుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి మూడు గంటల పాటు కదిలించకుండా ఉంచాలి.
3 గంటల తరువాత ఈ కలాకంద్ ను ఒక ప్లేట్ లోకి తీసుకుని మనకు కావల్సిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అచ్చం బయట షాపుల్లో లభించే విధంగా ఉండే కలాకంద్ తయారవుతుంది. ఇలా తయారు చేసిన కలాకంద్ ను కూడా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.