Mysore Pak : బ‌య‌ట దొరికే విధంగా మైసూర్ పాక్‌ను ఇలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Mysore Pak : మ‌న‌లో చాలా మంది తీపి ప‌దార్థాల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. మ‌న‌కు బ‌య‌ట కూడా అనేక ర‌కాల తీపి ప‌దార్థాలు ల‌భ్య‌మ‌వుతుంటాయి. బ‌య‌ట ఎక్కువ‌గా దొరికే తీపి ప‌దార్థాల‌లో శ‌న‌గ పిండితో చేసే మైసూర్ పాక్ ఒక‌టి. ఇది ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటుంటారు. మైసూర్ పాక్ మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా దొరుకుతుంది. దీనిని మ‌నం ఇంట్లోనే చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు.

క‌చ్చిత‌మైన కొల‌త‌ల‌తో చేయ‌డం వ‌ల్ల రుచిగా బ‌య‌ట దొరికే విధంగా ఉండే మైసూర్ పాక్ ను మ‌నం ఇంట్లోనే చేసుకోవ‌చ్చు. ఇంట్లో మైసూర్ పాక్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మైసూర్ పాక్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శ‌న‌గ పిండి – ఒక క‌ప్పు, వంట సోడా – పావు టీ స్పూన్, పంచ‌దార – ఒక క‌ప్పు, నీళ్లు – ముప్పావు క‌ప్పు, నూనె – ఒక‌ క‌ప్పు, నెయ్యి – ఒక క‌ప్పు, యాల‌కుల పొడి – చిటికెడు.

make Mysore Pak like hotel style
Mysore Pak

మైసూర్ పాక్ త‌యారీ విధానం..

ముందుగా శ‌న‌గ పిండిని జ‌ల్లెడ ప‌ట్టి అందులోనే వంట‌సోడాను క‌లిపి ప‌క్క‌న‌ ఉంచాలి. త‌రువాత లోతుగా ఉండే గిన్నెను తీసుకుని దానికి నెయ్యిని కానీ నూనె కానీ రాసి ప‌క్క‌న‌ ఉంచాలి. త‌రువాత‌ ఒక క‌ళాయిలో నూనెను, నెయ్యిని క‌లిపి పోసి చిన్న మంట‌పై మ‌రిగించుకోవాలి. ఇప్పుడు అడుగు భాగంలో మందంగా ఉండే క‌ళాయిని తీసుకుని అందులో పంచ‌దార‌ను, నీళ్ల‌ను పోసి మధ్య‌స్థ మంట‌పై పంచ‌దార క‌రిగి తీగ పాకం వ‌చ్చే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి. తీగ పాకం వ‌చ్చిన త‌రువాత యాల‌కుల పొడిని వేసి క‌లిపి మంట‌ను చిన్న‌గా చేసి ముందుగా జ‌ల్లెడ ప‌ట్టుకున్న శ‌న‌గ పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి.

ఇలా క‌లిపిన త‌రువాత శ‌న‌గ పిండిని 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత ఒక గ‌రిటెతో మ‌రిగించిన నెయ్యిని రెండు నిమిషాలకొక‌సారి నెయ్యి పూర్తిగా అయిపోయే వ‌ర‌కు శ‌న‌గ పిండి మిశ్ర‌మంలో పోస్తూ క‌లుపుతూ ఉండాలి. ఇలా క‌లిపిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ఈ మిశ్ర‌మాన్ని ముందుగా నెయ్యి లేదా నూనెను రాసిన గిన్నెలో వేసి పైన స‌మానంగా చేయాలి. ఇలా చేసిన మూడు నిమిషాల త‌రువాత క‌త్తితో కావ‌ల్సిన ప‌రిమాణంలో గాట్లు పెట్టుకుని ఈ మిశ్ర‌మం పూర్తిగా చ‌ల్లారే వ‌ర‌కు ఉంచి గిన్నె పై ప్లేటును బోర్లించి మైసూర్ పాక్ ను ప్లేట్ లోకి తీసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా బ‌య‌ట దొకికే విధంగా ఉండే మైసూర్ పాక్ త‌యార‌వుతుంది. నెయ్యిని తిన‌ని వారు ఇందులో పూర్తిగా నూనెను కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇందులో యెల్లో ఫుడ్ క‌ల‌ర్ ను కూడా వేసుకోవ‌చ్చు. మైసూర్ పాక్ త‌యారీలో శ‌న‌గ పిండిని ఏ క‌ప్పుతో తీసుకుంటామో అదే క‌ప్పు ప‌రిమాణంలో పంచ‌దార‌ను, నీళ్ల‌ను తీసుకోవాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల చ‌క్క‌ని రుచితో ఉండే మైసూర్ పాక్ త‌యార‌వుతుంది.

D

Recent Posts