Onion Pakoda : ఉల్లిపాయల వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని రోజూ చాలా మంది పచ్చిగానే తింటారు. ఉల్లిపాయలు మన శరీరానికి చలువ చేస్తాయి. కనుక వేసవిలో వీటిని ఎక్కువగా తింటుంటారు. ఇక ముఖ్యంగా పెరుగు లేదా మజ్జిగతో కలిపి ఉల్లిపాయలను తింటుంటారు. ఇలా తింటే ఎంతో రుచిగా ఉండడమే కాదు.. మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే ఉల్లిపాయలతో పకోడీలను కూడా కొందరు చేసుకుని తింటుంటారు. సాయంత్రం సమయంలో బయట తినే చిరుతిండి కన్నా ఉల్లిపాయల పకోడీలు ఎంతో రుచికరమైనవి. ఇంట్లో మనం వీటిని తక్కువ నూనెలోనూ వేయించి తినవచ్చు. దీంతో ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది. ఇక ఉల్లిపాయ పకోడీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ పకోడీ తయారీకి కావల్సినపదార్థాలు..
పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది), ఉప్పు – రుచికి సరిపడా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి -2, తరిగిన కరివేపాకు – కొద్దిగా, తరిగిన అల్లం ముక్కలు – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా చేసిన జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, శనగపిండి – అర కప్పు, నీళ్లు – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీ ఫ్రై కి సరిపడా.
ఉల్లిపాయ పకోడీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలను, రుచికి సరిపడా ఉప్పును వేసి కలిపి, చేత్తో ఉల్లిపాయ ముక్కలను బాగా నలపాలి. వీటిని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగాక ఉల్లిపాయలను పకోడీలా వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తరువాత టిష్యూ పేపర్ లను ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పకోడీ తయారవుతుంది. వీటిని నేరుగా లేదా టమాట కెచప్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది.