Poornam Boorelu : మనం వంటింట్లో బెల్లంతో రకరకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. మనం బెల్లంతో తయారు చేసే తీపి పదార్థాల్లో పూర్ణం బూరెలు కూడా ఒకటి. ఈ బూరెలు చాలా రుచిగా ఉంటాయి. ఈ పూర్ణం బూరెలను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటి తయారీ విధానం అందరికీ తెలిసినప్పటికీ కొందరు వీటిని ఎంత ప్రయత్నించినా చక్కగా, రుచిగా తయారు చేసుకోలేక పోతుంటారు. పూర్ణం బూరెలను నూనెలో వేయగానే పగిలి లోపలి మిశ్రమమంతా బయటకు వస్తుంది. ఇలా జరగకుండా పూర్ణం బూరెలను రుచిగా, చక్కగా ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్ణం బూరెల తయారీకి కావల్సిన పదార్థాలు..
మినప పప్పు – ఒక కప్పు, బియ్యం – ఒకటింపావు కప్పు, ఉప్పు – ఒకటిన్నర టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, శనగ పప్పు – ఒక కప్పు, నీళ్లు – రెండు కప్పులు, బెల్లం తురుము – ఒక కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
పూర్ణం బూరెల తయారీ విధానం..
ముందుగా మినప పప్పును, బియ్యాన్ని రెండు వేరువేరు గిన్నెలలో వేసి శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 4 నుండి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత వీటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని వేరు వేరుగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వీటిని మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువగా నీటిని పోయకూడదు. పిండి గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా పట్టిన మిక్సీ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పిండి అంతటినీ కలిపి మూత పెట్టి 2 గంటల పాటు పక్కన ఉంచాలి.
తరువాత ఒక గిన్నెలో శనగ పప్పును తీసుకుని శుభ్రంగా కడిగి అందులో రెండు కప్పుల నీళ్లు పోసి అర గంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఈ శనగ పప్పును నీటితో సహా కుక్కర్ లో వేసి మూతపెట్టి 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి శనగ పప్పులో ఉండే నీరు అంతా పోయేలా జల్లిగంటెతో వడకట్టుకోవాలి. తరువాత శనగ పప్పును గంటెతో లేదా పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. తరువాత ఈ శనగ పప్పు మిశ్రమంలో బెల్లం తురుమును వేసి మరలా చిన్న మంటపై వేడి చేయాలి. బెల్లం కరిగే వరకు అడుగు భాగం మాడిపోకుండా తిప్పుతూ ఉండాలి.
బెల్లం కరిగిన తరువాత అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. శనగపప్పు, బెల్లం మిశ్రమాన్ని నీరు లేకుండా దగ్గర పడే వరకు ఉడికించాలి. తరువాత యాలకుల పొడిని, నెయ్యిని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగా అయ్యే వరకు ఉంచాలి. శనగపప్పు మిశ్రమం చల్లగా అయిన తరువాత మనకు కావల్సిన పరిమాణంలో శనగపప్పు మిశ్రమాన్ని తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. తరువాత మినపప్పు, బియ్యం మిశ్రమాన్ని అంతా కలిసేలా మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి నూనె ను వేడి చేయాలి.
ఈ నూనెను మరీ ఎక్కువగా వేడి చేయకూడదు. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉండలను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని టిష్యూ పేపర్ ఉంచిన గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పూర్ణం బూరెలు తయారవుతాయి. ఈ బూరెలకు మధ్యలో వేలుతో రంధ్రం చేసి ఆ రంధ్రంలో నెయ్యి పోసుకుని తింటే బూరెలు చాలా రుచిగా ఉంటాయి.