Pumpkin Halwa : గుమ్మడికాయల్లో అనేక పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. గుమ్మడికాయలు, వాటిలో ఉండే విత్తనాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి శక్తిని అందిస్తాయి. వ్యాధుల నుంచి బయట పడేస్తాయి. అయితే గుమ్మడికాయను నేరుగా వండుకుని తినేందుకు చాలా మంది ఇష్ట పడరు. కానీ దీన్ని రుచిగా వండుకుంటే లొట్టలేసుకుంటూ తినవచ్చు. దీంతోపాటు వాటిల్లో ఉండే పోషకాలు కూడా లభిస్తాయి. ఈ క్రమంలోనే గుమ్మడికాయతో ఎంతో రుచికరమైన హల్వాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గుమ్మడి కాయ హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
గుమ్మడి కాయ ముక్క – అర కిలో, నెయ్యి – 2 టీ స్పూన్స్, జీడి పప్పు – 10 గ్రాములు, ఎండు ద్రాక్ష – 10 గ్రాములు, చక్కెర – 150 గ్రాములు, కోవా – 3 టీ స్పూన్స్, యాలకుల పొడి – పావు టీ స్పూన్.
గమ్మడి కాయ హల్వా తయారు చేసే విధానం..
ముందుగా గుమ్మడికాయపై ఉండే పొట్టును తొలగించి సన్నగా తురుము చేసుకోవాలి. తరువాత ఒక పాన్ తీసుకుని అందులో నెయ్యి వేయాలి. నెయ్యి కాగాక జీడి పప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో గుమ్మడికాయ తురుము వేసి 10 నిమిషాల పాటు బాగా వేయించిన తరువాత మూత పెట్టి గుమ్మడి కాయ తురుమును మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత చక్కెర వేసి దగ్గర పడే వరకు మరో 10 నిమిషాల పాటు వేయించాలి. ఇందులో జీడి పప్పు, ఎండు ద్రాక్ష, కోవా, యాలకుల పొడి వేసి మరో 5 నిమిషాల పాటు వేయించాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే గుమ్మడి కాయ హల్వా తయారవుతుంది. దీన్ని తింటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది. అయితే చక్కెరకు బదులుగా బెల్లం కూడా వేసి తయారు చేసుకోవచ్చు. దీన్ని అధిక బరువు ఉన్నవారు, షుగర్ ఉన్నవారు తినవచ్చు.