Rasgulla : మనకు బయట వివిధ రకాల తీపి పదార్థాలు లభిస్తాయి. మనకు బయట ఎక్కువగా లభించే తీపి పదార్థాలలో రసగుల్లా కూడా ఒకటి. రసగుల్లా ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఈ తియ్యటి పదార్థాన్ని ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు. రసగుల్లాలను మనం చాలా సులువుగా ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటాం. వీటిని పాలతో తయారు చేస్తారని మనందరికీ తెలుసు. కేవలం పాలతోనే కాకుండా మన ఇంట్లో మిగిలిన అన్నంతో లేదా తాజాగా వండిన అన్నంతో కూడా ఈ రసగుల్లాలను తయారు చేసుకోవచ్చు. మిగిలిన అన్నంతో రసగుల్లాలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రసగుల్లా తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – ఒక కప్పు, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, మైదా పిండి – ఒక టేబుల్ స్పూన్, మిల్క్ పౌడర్ – ఒక టేబుల్ స్పూన్, పంచదార – ఒక కప్పు, నీళ్లు – 2 కప్పులు, యాలకుల పొడి – చిటికెడు.
రసగుల్లా తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో అన్నాన్ని వేసి మెత్తని పేస్ట్ లా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక ప్లేట్ కు లేదా గిన్నెకు నెయ్యిని రాసి మిక్సీ పట్టిన అన్నాన్ని అందులోకి తీసుకోవాలి. ఇందులోనే మైదా పిండిని, మిల్క్ పౌడర్ ను, కార్న్ ఫ్లోర్ ను వేసుకోవాలి. తరువాత చేతికి నెయ్యిని రాసుకుంటూ 10 నుండి 15 నిమిషాల పాటు మెత్తగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత ఆ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ పగుళ్లు లేకుండా ఉండల్లా చుట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో పంచదారను, నీళ్లను పోసి పంచదార కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. పంచదార కరిగిన తరువాత యాలకుల పొడిని, ముందుగా తయారు చేసుకున్న అన్నం ఉండలను చిన్న మంటపై 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి వేడి తగ్గిన తరువాత గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అన్నం రసగుల్లాలు తయారవుతాయి. తీపి తినాలనిపించినప్పుడు లేదా అన్నం మిగిలినప్పుడు ఇలా చాలా సులువుగా రసగుల్లాలను తయారు చేసుకుని తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.