Barley : బార్లీ గింజలు.. ఇవి మనందరికీ తెలుసు. ఇవి ఒక రకం గడ్డి జాతి గింజలు. ఈ బార్లీ గింజలు మనకు ఆహారంగా, ఔషధంగా ఉపయోగపడతాయి. వీటిలో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అరుగుదల శక్తిని పెంచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఒక కప్పు ఉడికించిన బార్లీ గింజల్లో 4.5 గ్రా.ల పీచు పదార్థాలు, 12.5 మిల్లీ గ్రాముల పోలేట్ ఉంటాయి. అంతేకాకుండా ఈ బార్లీ గింజల్లో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. గ్లూటెన్ పదార్థాల ఎలర్జీ ఉన్న వారు వీటిని తీసుకోకూడదు. బార్లీ గింజలను తడి లేని, గాలి తగలని డబ్బాలో నిల్వ చేసుకోవడం వల్ల పోషకాలను కోల్పోకుండా కొన్ని నెలల వరకు తాజాగా ఉంటాయి. వివిధ రకాల సూప్ ల తయారీలో కూడా బార్లీ గింజలను ఉపయోగిస్తారు.
వీటిలో ఉండే బి విటమిన్స్ నీటిలో కలిగే తత్వాన్ని కలిగి ఉంటాయి. కనుక వీటిని నీటిలో ఉడికించినప్పుడు నీటితో సహా తీసుకోవాలి. మద్యపానం తయారీలో కూడా ఈ బార్లీ గింజలను ఉపయోగిస్తారు. బార్లీ గింజలను నాన బెట్టిన నీటిని రోజూ తాగడం వల్ల శరీరంలో ఎక్కువగా ఉన్న నీటి శాతం తగ్గుతుంది. ఒంట్లో నీరు చేరిన గర్భిణీ స్త్రీలు ఈ బార్లీ గింజలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా బలహీనంగా, నీరసంగా ఉన్న వారు ఈ బార్లీ నీటిని తాగడం వల్ల నీరసం తగ్గుతుంది. అంతేకాకుండా వీటిని రవ్వగా, పిండిగా చేసి ఆహార పదార్థాలను తయారు చేసుకుని తినడం వల్ల త్వరగా, తేలికగా జీర్ణమవుతాయి. బార్లీ గింజల నుండి తీసిన నూనెను వాడడం వల్ల శరీరంలో కొలెస్త్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
పిల్లలకు ఆహారంలో భాగంగా ఇచ్చే పాలలో, సూప్ లలో బార్లీ గింజలను ఉపయోగించడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. మన శరీరంలో ఉండే కాలేయంలో, రక్తంలో కొవ్వు చేరకుండా చేయడంలో ఈ బార్లీ గింజలు ఎంతగానో సహాయపడతాయి. రెండున్నర లీటర్ల నీటిలో ఒక కప్పు బార్లీ గింజలను వేసి సగం అయ్యే వరకు మరిగించి వడకట్టాలి. ఇలా వడకట్టిన నీటిని తాగడం వల్ల ప్రేగు కదలికలు పెరిగి జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
జ్వరం వచ్చిన వారికి ఆహారంలో భాగంగా బార్లీని ఇవ్వడం వల్ల జ్వరం నుండి త్వరగా కోలుకుంటారు. బార్లీ గింజల నుండి చేసిన గంజిలో మజ్జిగను, నిమ్మ రసాన్ని కలిపి తీసుకోవడం వల్ల మూత్ర సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. మూత్ర విసర్జన కష్టంగా ఉన్న వారు బార్లీ గింజల కషాయంలో బెల్లం, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు. బార్లీని పాలతో కలిపి తీసుకోవడం వల్ల బాలింతల్లో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ విధంగా బార్లీని గింజలను ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.