Rava Kesari : క్యారెట్, టమాటా, పల్లీలు.. తదితర పదార్థాలను వేసి తయారు చేసే ఉప్మా అంటే చాలా మందికి ఇష్టమే. దీన్ని చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. అయితే ఉప్మాను మనం ఉప్మారవ్వతో తయారు చేస్తాం. వాస్తవానికి దీంతో స్వీట్‌ను కూడా తయారు చేయవచ్చు. ఇలా ఉప్మారవ్వతో చేసే స్వీట్లలో రవ్వ కేసరి ఒకటి. దీన్నే సూజీ హల్వా అని కూడా అంటారు. ఈ రవ్వ కేసరి ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభమే. ఎంతో రుచిగా ఉండే ఈ రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ కేసరి తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, కాచి చల్లార్చిన పాలు – 2 కప్పులు, నెయ్యి – ఒక కప్పు, జీడి పప్పు – తగినంత, ఎండు ద్రాక్ష – తగినంత, నీళ్లు – ఒక కప్పు, పంచదార – ఒక కప్పు, యాలకుల పొడి – పావు టీ స్పూన్.
రవ్వకేసరి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి నెయ్యి కరిగిన తరువాత జీడి పప్పును, ఎండు ద్రాక్షను వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకుని పక్కన ఉంచాలి. ఇప్పుడు అదే కళాయిలో రవ్వను వేసి చిన్న మంటపై కలుపుతూ 5 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన తరువాత పాలను, నీళ్లను పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత యాలకుల పొడి, ముందుగా వేయించిన డ్రైఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ కేసరి తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు చాలా తక్కువ సమయంలోనే చాలా సులువుగా ఇలా రవ్వ కేసరిని తయారు చేసుకుని తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది.