Oats Halwa : ఓట్స్‌తో ఎంతో రుచికరమైన హల్వాను ఇలా తయారు చేసుకోవాలి..!

Oats Halwa : ఓట్స్‌ను తినడం వల్ల మన శరీరానికి ఎంత మేలు జరుగుతుందో అందరికీ తెలిసిందే. వీటిల్లో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. కనుక హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇంకా ఎన్నో లాభాలు మనకు ఓట్స్‌ వల్ల కలుగుతాయి. అయితే ఓట్స్‌ను నేరుగా తినేందుకు చాలా మంది ఇష్టపడరు. వాటితో భిన్న రకాల వంటలను తయారు చేసి తింటుంటారు. అలాంటి వాటిల్లో ఓట్స్‌ హల్వా ఒకటి. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభమే. పైగా దీన్ని తింటే మనకు పోషకాలు లభిస్తాయి. కనుక ఓట్స్‌ను నేరుగా తినలేని వారు వీటితో హల్వాను తయారు చేసుకుని తినవచ్చు. ఇక ఓట్స్‌ హల్వాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓట్స్‌ హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..

బ్రెడ్‌ ముక్కలు – ఐదు, ఓట్స్‌ – ఒక కప్పు, నెయ్యి – అరకప్పు, చక్కెర – ఒకటిన్నర కప్పు, కుంకుమ పువ్వు – కొద్దిగా, యాలకుల పొడి – పావు టీస్పూన్‌, ఎండు ద్రాక్ష – నాలుగు టీస్పూన్లు, జీడిపప్పు – 50 గ్రాములు, పాలు – రెండు కప్పులు, కోవా – ఐదు టీస్పూన్లు.

Oats Halwa very tasty make in this method
Oats Halwa

ఓట్స్‌ హల్వాను తయారు చేసే విధానం..

రెండు టీస్పూన్ల పాలలో కుంకుమ పువ్వును నానబెట్టుకోవాలి. బ్రెడ్‌ ముక్కలను నాలుగు భాగాలుగా కోసి నెయ్యిలో వేయించి తీసి పెట్టుకోవాలి. అదే బాణలిలో ఓట్స్‌ను కూడా వేయించి చల్లారనివ్వాలి. అలాగే జీడిపప్పు, ఎండు ద్రాక్ష పలుకులను కూడా వేయించుకోవాలి. చల్లారిన ఓట్స్‌ను పొడి చేసుకుని మరోసారి వేయించి అందులో బ్రెడ్‌ ముక్కలు, పాలు వేసి బాగా కలపాలి. ఇందులో నానిన కుంకుమ పువ్వును పాలతో సహా వేసి తరువాత యాలకుల పొడి, చక్కెర, కోవా వేసి బాగా కలిపి సన్నని మంటపై ఉంచాలి. 15 నిమిషాల తరువాత ఈ మిశ్రమం గట్టిపడుతుంది. మిశ్రమం దగ్గరపడుతున్నప్పుడు దింపేసి ఎండు ద్రాక్ష, జీడిపప్పు పలుకులు వేసి మరోసారి కలిపితే చాలు. రుచికరమైన ఓట్స్‌ హల్వా తయారవుతుంది. దీన్ని ఎప్పుడైనా సరే తినవచ్చు. దీంతో ఓట్స్‌ వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.

Editor

Recent Posts