Rice Papads : మనం బియ్యం పిండితో రకరకాల పిండి వంటలను, చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసుకోదగిన వంటకాల్లో రైస్ పాపడ్స్ కూడా ఒకటి. ఇవి చాలా రుచిగా కరకరలాడుతూ ఉంటాయి. ఈ రైస్ పాపడ్స్ ను తయారు చేయడం చాలా సులభం. రుచిగా సులభంగా రైస్ పాపడ్స్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రైస్ పాపడ్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – ఒక కప్పు, నీళ్లు – ఒక కప్పు, బటర్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – ఒక టీ స్పూన్, చిల్లీ ప్లేక్స్ – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
రైస్ పాపడ్స్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నీటిని పోసి వేడి చేయాలి. ఇందులోనే బటర్, ఉప్పు, చిల్లీ ప్లేక్స్, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత మంటను చిన్నగా చేసి బియ్యం పిండిని వేసి కలపాలి. పిండి బాగా కలిసిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. పిండి గోరు వెచ్చగా అయిన తరువాత చేతికి తడిని చేసుకుంటూ పిండిని చపాతీ పిండిలా మెత్తగా కలపాలి. తరువాత కొద్దిగా పిండిని తీసుకుని మిగిలిన పిండిపై మూతను ఉంచాలి. తరువాత ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి ఒక్కో ముద్దను తీసుకుంటూ రెండు వేళ్లతో మందంగా ఉండేలా చెక్కల ఆకారంలో వత్తాలి.
ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడాయ్యాక రైస్ పాపడ్స్ ను నూనెలో వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని టిష్యూ పేపర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కరకరలాడుతూ రుచిగా ఉండే రైస్ పాపడ్స్ తయారవుతాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఈ రైస్ పాపడ్స్ చక్కగా ఉంటాయి. వీటిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 20 రోజుల వరకు తాజాగా ఉంటాయి.