Sambar Powder : మనం వంటింట్లో కూరలతోపాటు అప్పుడప్పుడు సాంబార్ ను కూడా తయారు చేస్తూ ఉంటాం. సాంబార్ ఎంత రుచిగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. సాంబార్ తయారీలో మనం సాంబార్ పౌడర్ ను ఉపయోగిస్తూ ఉంటాం. దీనిని మనం బయట ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటాం. బయట కొనుగోలు చేసే పని లేకుండా సాంబార్ పౌడర్ ను ఇంట్లోనే మనం చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. సాంబార్ పౌడర్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాంబార్ పౌడర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ధనియాలు – ఒక కప్పు, శనగపప్పు – అర కప్పు, కంది పప్పు – అర కప్పు, మినప పప్పు – పావు కప్పు, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, ఎండు మిర్చి – 10 నుండి 15, బియ్యం – ఒక టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, కరివేపాకు – అర కప్పు.
సాంబార్ పౌడర్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో కందిపప్పు, మినప పప్పు, శనగపప్పు వేసి మధ్యస్థ మంటపై రంగు మారే వరకు వేయించి ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, బియ్యం వేసి కలుపుతూ వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మిరియాలు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువలను ఒక్కొక్కటిగా వేస్తూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పదార్థాలన్నీ చల్లగా అయిన తరువాత జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బయట దొరికే విధంగా ఉండే సాంబార్ పొడి తయారవుతుంది. దీనిని తడి లేని, మూత ఉండే గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది. ఇలా చేసుకున్న సాంబార్ పౌడర్ ను సాంబార్ తయారీలో వాడడం వల్ల ఎంతో రుచిగా ఉండే సాంబార్ తయారవుతుంది.