Sweet Chutney : మనం ఉదయం అల్పాహారంగా తినడానికి దోశ, ఇడ్లీ, వడ వంటి రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. వీటిని తినడానికి వివిధ రకాల చట్నీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. మనం సాధారణంగా వీటిని తినడానికి పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, టమాట చట్నీ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా ఇడ్లీ, దోశ వంటి వాటిని తినడానికి స్వీట్ చట్నీని కూడా తయారు చేసుకోవచ్చు. స్వీట్ చట్నీ తో తింటే దోశ, ఇడ్లీ వంటి వాటి రుచి మరింత పెరుగుతుంది. మనం చాలా సులువుగా స్వీట్ చట్నీ ని తయారు చేసుకోవచ్చు. స్వీట్ చట్నీ ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్ చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన చింతనండు – 10 గ్రా., నూనె – అర టేబుల్ స్పూన్, మినప పప్పు – ఒక టేబుల్ స్పూన్, శనగ పప్పు – అర టేబుల్ స్పూన్, ధనియాలు – అర టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండు మిరపకాయలు – 5 నుండి 7, కరివేపాకు – రెండు రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు – 2, బెల్లం తురుము – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత.
స్వీట్ చట్నీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత శనగ పప్పు, మినప పప్పు, ధనియాలు, జీలకర్ర వేసి చిన్న మంటపై 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత ఎండు మిరపకాయలను, కరివేపాకును కూడా వేసి వేయించి చల్లగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఇందులోనే నానబెట్టిన చింతపండును, ఉప్పును, బెల్లం తురుమును, వెల్లుల్లి రెబ్బలను వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్వీట్ చట్నీ తయారవుతంది. ఈ చట్నీ ని ఇడ్లీ, దోశ, వడ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవడం వల్ల 4 రోజుల వరకు కూడా తాజాగా ఉంటుంది.