Gutti Vankaya Curry : మనం ఆహారంగా వంకాయలను కూడా తీసుకుంటూ ఉంటాం. వంకాయలను మితంగా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. వంకాయల్లో వివిధ రకాలు ఉంటాయి. అందులో గుత్తి వంకాయలు కూడా ఒకటి. గుత్తి వంకాయ అనగానే ముందుగా అందరికీ దీంతో చేసే మసాలా కూరనే గుర్తుకు వస్తుంది. గుత్తి వంకాయతో చేసే మసాలా కూర ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా తయారు చేస్తారు. అందులో భాగంగా ఆంధ్రా గుత్తి వంకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రా గుత్తి వంకాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
గుత్తి వంకాయలు – పావు కిలో, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – 2 టీ స్పూన్లు, ఎండు కొబ్బరి ముక్కలు – 6 లేదా 7, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, అల్లం – 2 ఇంచుల ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 8, తరిగిన టమాట – 1, తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది), కొత్తిమీర – గుప్పెడు, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, నానబెట్టిన చింతపండు – 10 గ్రాములు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, లవంగాలు – 3, యాలకులు – 3, దాల్చిన చెక్క ముక్కలు – 2, సాజీరా – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, పొడుగ్గా తరిగిన పచ్చి మిర్చి – 2, నీళ్లు – తగినన్ని, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆంధ్రా గుత్తి వంకాయ కూర తయారీ విధానం..
ముందుగా వంకాయల తొడిమ తీయకుండా నిలువుగా నాలుగు ముక్కలుగా చేసి ఉప్పు వేసిన నీటిలో వేసి 10 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత ఒక కళాయిలో పల్లీలను వేసి దోరగా వేయించాలి. తరువాత ధనియాలను, ఎండు కొబ్బరి ముక్కలను వేసి వేయించాలి. ఇవి అన్నీ వేగిన తరువాత నువ్వులను వేసి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. వీటన్నింటినీ ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇందులోనే అల్లాన్ని ముక్కలుగా చేసి వేయాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలను, టమాట ముక్కలను, ఉల్లిపాయ ముక్కలను, కొత్తిమీరను, కొద్దిగా నీటిని పోసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి.
మరలా ఇందులోనే ఉప్పును, కారాన్ని, పసుపును వేసి మరలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలను నీటి నుండి బయటకు తీసి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వంకాయలల్లో తగినంత కూరాలి. తరువాత ఒక కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత లవంగాలను, యాలకులను, దాల్చిన చెక్క ముక్కలను, సాజీరాను, బిర్యానీ ఆకును, పచ్చి మిర్చిని వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత వంకాయలను వేసి మూత పెట్టి వంకాయలు పూర్తిగా ఉడికే వరకు ఉంచాలి.
వంకాయలు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వంకాయలు ఉడికిన తరువాత వంకాయల్లో పెట్టగా మిగిలిన మిశ్రమాన్ని వేసి తగినన్ని నీళ్లు, చింతపండు రసం వేసి కలిపి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తరువాత కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ కూర తయారవుతుంది. దీనిని అన్నం, వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.