Vegetable Puri : మనం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా అప్పుడప్పుడు పూరీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. పూరీలు రుచిగా ఉన్నప్పటికి వీటి తయారీకి అధికంగా నూనెను వాడాల్సి వస్తుంది. తక్కువ నూనెను వాడుతూ.. ఆరోగ్యకరంగా పూరీలను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన పూరీల తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన పాలకూర – ఒక కట్ట, క్యారెట్ ముక్కలు – ఒక కప్పు, బీట్ రూట్ ముక్కలు – ఒక కప్పు, గోధుమ పిండి – మూడు కప్పులు, ఉప్పు – కొద్దిగా, పంచదార – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కు సరిపడా, నీళ్లు – తగినన్ని.
ఆరోగ్యకరమైన పూరీలను తయారు చేసే విధానం..
ముందుగా పాలకూరను తరిగి శుభ్రంగా కడగాలి. తరువాత ఒక జార్ లో తరిగిన పాలకూరను, కొద్దిగా నీటిని పోసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పేస్ట్ ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా క్యారెట్ ముక్కలను, బీట్ రూట్ ముక్కలను వేరు వేరుగా జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఒక గిన్నెలోఒక కప్పు గోధుమ పిండి, ఉప్పు, పంచదార, రెండు టీ స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. తరువాత ముందుగా చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ను వేసి కలుపుకోవాలి. అదే విధంగా క్యారెట్ పేస్ట్ ను, బీట్ రూట్ పేస్ట్ ను వేసి వేరు వేరుగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత కావల్సిన పరిమాణంలో ముద్దలను చేసుకుని మరీ పలుచగా కాకుండా పూరీలలా ఒత్తుకోవాలి.
ఇప్పుడు కళాయిలో డీప్ ఫ్రై కు సరిపడా నూనె పోసి కాగాక పూరీలను కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల మూడు రకాల కూరగాయలతో రంగు రంగుల పూరీలు తయారవుతాయి. పూరీని తయారు చేసుకునే పిండిలో పంచదారను కలపడం వల్ల నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి. ఈ విధంగా కలుపుకున్న పిండితో పూరీలకు బదులుగా చపాతీలను కూడా చేసుకోవచ్చు. ఇలా తయారు చేసే పూరీలు కానీ, చపాతీలు కానీ చాలా మెత్తగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. పాలకూర, క్యారెట్, బీట్ రూట్ ల వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు. ఇదేవిధంగా ఇతర ఆకుకూరలు, కూరగాయలతోనూ పూరీలను ఆరోగ్యవంతంగా తయారు చేసుకుని తినవచ్చు. దీంతో పోషకాలు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు లభిస్తాయి.