Wheat Dosa : మనం ఉదయం పూట అల్పాహారంలో భాగంగా వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో దోశలు కూడా ఒకటి. దోశలను మనలో చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే మనం వివిధ రకాల రుచుల్లో ఈ దోశలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మన శరీరానికి మేలు చేసే గోధుమ పిండితో దోశలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ పిండి దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ పిండి – ఒక కప్పు, ఎండు మిర్చి – 2, బియ్యం పిండి – పావు కప్పు, బొంబాయి రవ్వ – ఒక టేబుల్ స్పూన్, పెద్ద ముక్కలుగా తరిగిన టమాట – 1 ( పెద్దది), ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – 3 కప్పులు లేదా తగినన్ని, నూనె – అర కప్పు.
గోధుమ పిండి దోశల తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో ఎండు మిరపకాయలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత అందులోనే టమాట ముక్కలను వేసి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో గోధుమపిండిని, బియ్యం పిండిని, బొంబాయి రవ్వను, తగినంత ఉప్పును, తరిగిన ఉల్లిపాయ ముక్కలను, కొత్తిమీరను, ముందుగా మిక్సీ పట్టుకున్న టమాట మిశ్రమాన్ని, రెండు కప్పుల నీళ్లను పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి 20 నిమిషాల పాటు కదిలించకుండా ఉంచాలి. తరువాత మరో కప్పు నీళ్లను పోసి మామూలు దోశ పిండి కంటే పలుచగా అయ్యేలా కలుపుకోవాలి.
తరువాత స్టవ్ మీద పెనాన్ని ఉంచి పెనం వేడయ్యాక పెనం మీద నూనెను రాయాలి. తరువాత తగినంత పిండిని తీసుకుంటూ రవ్వ దోశ మాదిరి ఈ దోశను కూడా పెనం మీద వేసుకోవాలి. తరువాత దోశ మీద మరి కొద్దిగా నూనెను వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత దోశను మరో వైపుకు తిప్పి అర నిమిషం పాటు ఉంచి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమపిండి దోశలు తయారవుతాయి. ఈ దోశలను పెనం మీద వేసేటప్పుడు ప్రతిసారి కూడా పిండిని కలుపుతూ ఉండాలి. ఈ విధంగా తయారు చేసుకున్న గోధుమ పిండి దోశలను టమాట చట్నీ, పల్లి చట్నీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఉదయం పూట సమయం లేని వారు ఇలా అప్పటికప్పుడు చాలా తక్కువ సమయంలోనే ఎంతో రుచిగా ఆరోగ్యానికి మేలు చేసే విధంగా గోధుమ పిండి దోశలను తయారు చేసుకుని తినవచ్చు.