Malai Kebab : మలై కబాబ్స్.. చికెన్ తో చేసే ఈకబాబ్స్ చాలా రుచిగా ఉంటాయి. ఎక్కువగా మనకు రెస్టారెంట్ లలో లభిస్తుంది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా, స్టాటర్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ మలై కబాబ్స్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఒవెన్, తందూర్ లేకపోయినా కూడా ఈ మలై కబాబ్స్ ను తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేసుకోవడం చాలా సులభం. ఇంట్లో పార్టీలు జరిగినప్పుడు, వీకెండ్స్ లో ఇలా మలై కబాబ్స్ ను తయారు చేసి తీసుకోవచ్చు. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ మలై కబాబ్స్ ను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
మలై కబాబ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్ లెస్ చికెన్ – అరకిలో, నిమ్మరసం – అర చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా – ముప్పావు టీ స్పూన్, వేయించిన జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, యాలకుల పొడి – అర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, నీళ్లు తీసేసిన పెరుగు ( హంగ్ కర్డ్) – పావు కప్పు, ప్రెష్ క్రీమ్ – పావు కప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్.
మలై కబాబ్ తయారీ విధానం..
ముందుగా చికెన్ ను గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత నూనె వేసి కలపాలి. ఇప్పుడు ఈ చికెన్ ను రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా కుదరని వాళ్లు కనీసం 5 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ అయిన తరువాత కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. వీటిపై మూత పెట్టి 10 నిమిషాలకొకసారి అటూ ఇటూ తిప్పుతూ ముక్కలను వేయించాలి. ఈ చికెన్ ముక్కలను మెత్తగా అయ్యే వరకు వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల పాటు నీటిలో నానబెట్టిన చాప్ స్టిక్స్ ను తీసుకుని వాటికి వేయించిన ఈ చికెన్ ముక్కలను గుచ్చాలి. తరువాత వీటిని మంటపై ఉంచి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగాఉండే మలై కబాబ్ తయారవుతుంది. దీనిని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఇంట్లోనే చాలా సులభంగా మలై కబాబ్ ను తయారు చేసి తీసుకోవచ్చు.