Mando Candy : మామిడికాయల సీజన్ రానే వచ్చింది. మనలో చాలా మంది మామిడికాయలను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మామిడికాయలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరానికి కావల్సిన వివిధ రకాల పోషకాలను అందించడంలో ఇలా అనేక రకాలుగా ఇవి మనకు సహాయపడతాయి. మన ఆరోగ్యానికి మేలు చేసే మామిడికాయలతో మనం ఎంతో రుచిగా ఉండే మ్యాంగో క్యాండీలను కూడా తయారు చేసుకోవచ్చు. మ్యాంగో క్యాండీలు చాలా రుచిగా ఉంటాయి. ఈ క్యాండీలను తయారు చేసుకుని తినడం వల్ల మనం ఎప్పుడు పడితే అప్పుడు మామిడికాయలను తిన్న అనుభూతిని పొందవచ్చు. మామిడికాయలతో మ్యాంగో క్యాండీలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాంగో క్యాండీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పుల్లటి పచ్చి మామిడికాయలు – 3, నీళ్లు – 3 గ్లాసులు, పంచదార – ఒక కప్పు, పంచదార పొడి – ఒక టీ స్పూన్.
మ్యాంగో క్యాండీ తయారీ విధానం..
ముందుగా మామిడికాయలపై ఉండే చెక్కును తీసేసి నిలువుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలను మరీ సన్నగా కట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత మామిడికాయ ముక్కలను వేసి 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని మరో ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గాజు గిన్నెలో లేదా ప్లాస్టిక్ గిన్నెలో ముందుగా ఒక లేయర్ గా పంచదారను వేసుకోవాలి. తరువాత ఒక దానిపై మామిడికాయ ముక్కలను లేయర్ గా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలపై పంచదారను మరో లేయర్ గా వేసుకోవాలి. తరువాత మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. మిగిలిన పంచదారను ముక్కలపై లేయర్ గా వేసుకోవాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి ఒక రోజంతా అలాగే ఉంచాలి.
మరుసటి రోజు ఈ ముక్కలను నీళ్లు లేకుండా ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ ముక్కలను ఒక రోజంతా ఎండలో ఎండబెట్టాలి. వీటి మరీ పూర్తిగా ఎండబెట్టకూడదు. ఈ ముక్కలు జెల్లీ లాగా ఎండిన తరువాత వాటికి పంచదార పొడిని కలిపి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మ్యాంగో క్యాండీ తయారవుతుంది. వీటిని బయట ఉంచడం వల్ల 2 నెలల పాటు తాజాగా ఉంటాయి. అదే ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల 6 నుండి 7 నెలల పాటు తాజాగా ఉంటాయి. మామిడికాయలు ఎక్కువగా లభించినప్పుడు ఈ క్యాండీలను తయారు చేసుకుని ఎప్పుడు పడితే అప్పుడు తినవచ్చు. పిల్లలు వీటిని మరింత ఇష్టంగా తింటారు.