Wheat Flour Laddu : మనం గోధుమ పిండితో చపాతీ, రొట్టెలు, పుల్కాలు ఇలా రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. ఇవి మనందరికి తెలిసినవే. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. గోధుమపిండితో ఇవే కాకుండా మనం ఎంతో రుచిగా ఉండే లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డూలను తయారు చేయడం చాలా సులభం. అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి. గోధుమపిండితో లడ్డూలను సులభంగా, రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమపిండి లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – అర కప్పు, బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్స్, గోధుమపిండి – ఒక కప్పు, కాచి చల్లార్చిన పాలు – పావు కప్పు, వేయించిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, బెల్లం తరుగు – అర కప్పు లేదా తగినంత, బాదం పప్పు -య10, యాలకులు – 4.
గోధుమ లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక రవ్వ వేసి వేయించాలి. తరువాత గోధుమపిండి వేసి వేయించాలి. దీనిని కలుపుతూ కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ పది నిమిషాల పాటు చక్కగా వేయించాలి. ఇలా వేయించిన తరువాత పాలు పోసి కలపాలి. దీనిని మరలా పొడి పొడిగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత జార్ లో బెల్లం, ఒక టేబుల్ స్పూన్ వేయించిన గోధుమపిండి, బాదం పప్పు, యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు బెల్లం మిశ్రమాన్ని అలాగే డై ఫ్రూట్స్ ను కూడా వేయించిన గోధుమపిండిలో వేసి కలపాలి. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకుని కావల్సిన పరిమాణంలో లడ్డూలుగా చట్టుకోవాలి. ఇవి లడ్డూలుగా చుట్టడానికి రాకపోతే కొద్దిగా నెయ్యి వేసుకుని కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమపిండి లడ్డూలు తయారవుతాయి. వీటిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. వీటిని చక్కగా నిల్వ చేసుకోవడం వల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ విధంగా గోధుమపిండితో చేసిన లడ్డూలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.