Mango Kulfi : వేసవి కాలంలో సహజంగానే చాలా మంది మామిడి పండ్లను అధికంగా తింటుంటారు. ఈ సీజన్లో అనేక రకాల వెరైటీ మామిడి పండ్లు లభిస్తుంటాయి. అయితే మామిడి పండ్లను నేరుగా తినకుండా కొందరు వాటితో కేకులు, స్వీట్లు, ఐస్ క్రీమ్స్ వంటివి చేసుకుని తింటుంటారు. ఈ క్రమంలోనే మామిడి పండ్లతో ఎంతో రుచిగా ఉండే కుల్ఫీని కూడా చేయవచ్చు. దీన్ని చేయడం కూడా సులభమే. బయట లభించే లాంటి టేస్ట్ వస్తుంది. ఇక మ్యాంగో కుల్ఫీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాంగో కుల్ఫీ తయారీకి కావలసిన పదార్థాలు..
పాలు – అర కప్పు, మామిడిపండు గుజ్జు – ఒక కప్పు, కండెన్స్డ్ మిల్క్ – పావు కప్పు, పంచదార – 3 టేబుల్ స్పూన్లు, కోవా – 50 గ్రాములు.
మ్యాంగో కుల్ఫీ తయారీ విధానం..
ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి పాలను బాగా మరిగించాలి. పాలు బాగా మరిగిన తరువాత దీనిలో కండెన్స్డ్ మిల్క్, పంచదార వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమంలో కోవా వేసి చిన్న మంటపై ఉడికించాలి. ఈ విధంగా ఈ మిశ్రమం మొత్తం ఐదు నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఆ మిశ్రమంలో మామిడి పండు గుజ్జును వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ విధంగా బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్‌లో పోయాలి. 6 నుంచి 8 గంటలపాటు డీప్ ఫ్రిజ్‌లో ఉంచుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మ్యాంగో కుల్ఫీ రెడీ అయినట్లే. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. అందరికీ ఎంతగానో నచ్చుతుంది.