Mango Mastani : మామిడి పండ్లు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు. మామిడి పండ్లను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈ మామిడి పండ్లను నేరుగా తినడంతో పాటు వీటితో రకరకాల జ్యూస్ లను, మిల్క్ షేక్ లను తయారు చేస్తూ ఉంటాము. మామిడి పండ్లతో చేసుకోదగిన రుచికరమైన పదార్థాల్లో మ్యాంగో మస్తానీ కూడా ఒకటి. ఎక్కువగా వేసవికాలంలో రోడ్ల పక్కన బండ్ల మీద లభిస్తుంది. ఈ మ్యాంగో మస్తానీని మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని కేవలం 5 నిమిషాల్లోనే మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు. మామిడి పండ్లతో రుచిగా మ్యాంగో మస్తానీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాంగో మస్తానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మామిడి పండ్లు – 2, పంచదార – 4 నుండి 5 టేబుల్ స్పూన్స్, కాచి చల్లార్చని పాలు – ఒకటిన్నర కప్పు, నానబెట్టిన సబ్జా గింజలు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా.
మ్యాంగో మస్తానీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో మామిడి పండు ముక్కలను తీసుకోవాలి. తరువాత ఇందులో పంచదార, పాలు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గ్లాస్ లో ఒక టేబుల్ స్పూన్ మామిడి పండు ముక్కలను తీసుకోవాలి. తరువాత వాటిపై సబ్జా గింజలను వేసుకోవాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మ్యాంగో మిశ్రమాన్ని పోయాలి. తరువాత దీనిపై ఒక స్కూబ్ ఐస్ క్రీమ్ ను వేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ పై మరికొన్ని మామిడికాయ ముక్కలు, డ్రై ఫ్రూట్స్ ను చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా కమ్మగా ఉండే మ్యాంగో మస్తానీ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు. వేసవికాలంలో ఇలా ఇంట్లోనే మామిడి పండ్లతో రుచిగా మ్యాంగో మస్తానీని తయారు చేసుకుని తాగవచ్చు.