Masala Palli Chaat Recipe : పల్లీలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. పల్లీలను వంటల్లో వాడడంతో పాటు వీటితో చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా పల్లీలతో ఎంతో రుచిగా ఉండే మసాలా పల్లి చాట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా పల్లి చాట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 100 గ్రా., చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1 ( పెద్దది), చిన్నగా తరిగిన టమాట – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, గరం మసాలా పొడి – ఒక టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నిమ్మరసం – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పల్లి చాట్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పల్లీలను తీసుకోవాలి. తరువాత వాటిలో తగినన్ని నీళ్లు పోసి రెండు గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ పల్లీలలోని నీటిని పారబోసి మరలా ఒక గ్లాస్ నీటిని పోసి 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి. పల్లీలు మెత్తగా ఉడికిన తరువాత నీటిని వడకట్టి వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత వాటిలో మిగిలిన పదార్థాలు వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా పల్లి చాట్ తయారవుతుంది. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఆరోగ్యానికి హానిని కలిగించే చిరుతిళ్లను తినడానికి బదులుగా ఇలా మసాలా పల్లి చాట్ ను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు.