Masala Tea : మనలో చాలా మంది టీ ని ఇష్టంగా తాగుతూ ఉంటారు. కొందరైతే ఉదయం లేచిన వెంటనే టీ ని తాగుతూ ఉంటారు. టీ తాగడం వల్ల మనసుకు ఆహ్లాదంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు టీ తాగడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. అలాగే మనం వివిధ రుచుల్లో టీ ని తయారు చేసుకుని తాగుతూ ఉంటాము. వివిధ రకాల టీ వెరైటీలలో మసాలా టీ కూడా ఒకటి. ఈ టీ ని తాగడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కడా పొందవచ్చు. జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడే వారు ఈ టీ ని తాగడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.
అంతేకాకుండా ఈ టీని తాగడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మనకు సులభంగా లభించే మసాలా దినుసులతో పౌడర్ ను తయారు చేసుకుని ఆ పౌడర్ మనకు కావల్సినప్పుడు టీ ని తయారు చేసుకుని తాగవచ్చు. ఈ మసాలా టీ తయారీకి కావల్సిన మసాలా పౌడర్ ను అలాగే దీనితో టీ ని ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా టీ పౌడర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
దంచిన అతి మధురం వేర్లు – 2, తులసి ఆకులు – 10, దాల్చిన చెక్క ముక్కలు -4, యాలకులు – 20, లవంగాలు – 30, నల్ల యాలకులు – 4, దంచిన జాజికాయ – 1, మిరియాలు- 3 టీ స్పూన్స్, శొంఠి ముక్కలు – 10, ఎండిన తులసి పువ్వులు- గుప్పెడు.
టీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – ఒక గ్లాస్, పటిక బెల్లం – 2 టీ స్పూన్స్ లేదా తగినంత, టీ పౌడర్ – ఒక టీ స్పూన్, మసాలా టీ పౌడర్ -ఒక టీ స్పూన్, పాలు – రెండు కప్పులు.
మసాలా టీ పౌడర్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో మసాలా పౌడర్ కు కావల్సిన పదార్థాలు వేసి దోరగా వేయించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ దినుసులను జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ చల్లారిన తరువాత గాజు సీసాలో వేసి నిల్వచేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ తో టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ఒక గిన్నెలో నీళ్లు, పటిక బెల్లం, టీ పౌడర్ వేసి వేడి చేయాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి.
తరువాత పాలు పోసి కలపాలి. ఈ టీ ని మరో 3 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ టీని వడకట్టి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా టీ తయారవుతుంది. దీనిని తాగడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. సీజనల్ గా వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.