Meal Maker Biryani : ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో మీల్ మేకర్ కూడా ఒకటి. మీల్ మేకర్ ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మీల్ మేకర్ తో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. మీల్ మేకర్ లతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే తరచూ ఒకేరకం వంటకాలు కాకుండా మీల్ మేకర్ లతో మనం ఎంతో రుచిగా ఉండే బిర్యానీని కూడా తయారు చేసుకోవచ్చు. వీకెండ్స్ లో చేసుకోవడానికి, ఇంటికి అతిథులు వచ్చినప్పుడే చేయడానికి ఈ బిర్యానీ చాలా చక్కగా ఉంటుంది. దీనిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మీల్ మేకర్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీల్ మేకర్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మీల్ మేకర్ – ఒక కప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 6, టమాటాలు – 2, బిర్యానీ ఆకు – 1, సాజీరా – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 3, అనాస పువ్వు – 1, సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా లేదా బిర్యానీ మసాలా – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, నానబెట్టిన బాస్మతీ బియ్యం – ఒక గ్లాస్, నీళ్లు – ఒకటి ముప్పావు కప్పు.
మీల్ మేకర్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా మీల్ మేకర్ లో వేడి నీటిని పోసి నానబెట్టాలి. తరువాత నీటిని పిండేసి వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, టమాట ముక్కలు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తరువాత జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత మీల్ మేకర్ వేసి వేయించాలి.
వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలపాలి. మసాలా అంతా ముక్కలకు పట్టించిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. తరువాత బాస్మతీ బియ్యం వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి మధ్యస్థ మంటపై 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మంటను చిన్నగా చేసి మరో 10 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు అలాగే ఉంచిన తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ బిర్యానీ తయారవుతుంది. దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన మీల్ మేకర్ బిర్యానీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.