Meal Maker Curry : మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో మీల్ మేకర్స్ కూడా ఒకటి. ఇవి అందరికీ తెలిసినవే. సోయా బీన్స్ నుండి నూనెను తీసిన తరువాత మిగిలిన పదార్థంతో వీటిని తయారు చేస్తారు. మీల్ మేకర్స్ ను తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మాంసాహారం తినని వారు వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ అన్నీ లభిస్తాయి. బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, హార్మోన్ అసమతుల్యతల వల్ల వచ్చే సమస్యలను తగ్గించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మీల్ మేకర్స్ తో కూడా మనం రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మీల్ మేకర్స్ తో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీల్ మేకర్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మీల్ మేకర్ – ఒక కప్పు, బటర్ – 3 టేబుల్ స్పూన్స్, పచ్చి మిర్చి – 3, జీడిపప్పు – 10, వెల్లుల్లి రెబ్బలు – 10, తరిగిన అల్లం ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది), తరిగిన టమాట – 1 (పెద్దది), బిర్యానీ ఆకు – 1, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒకటిన్నర టీ స్పూన్, గరంమసాలా – ఒక టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ – ఒక టేబుల్ స్పూన్.
మీల్ మేకర్ కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీళ్లను పోసి మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వెంటనే ఇందులో మీల్ మేకర్ లను వేసి 3 నిమిషాల పాటు ఉంచి మీల్ మేకర్ ల నుండి నీటిని వేరు చేయాలి. ఈ మీల్ మేకర్ లను చేత్తో పిండుతూ వాటిలో ఉండే నీటినంతటిని తీసేయాలి. ఇప్పుడు ఒక కళాయిలో అర టేబుల్ స్పూన్ బటర్ ను వేసి బటర్ కరిగిన తరువాత ముందుగా ఉడికించిన మీల్ మేకర్ ను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ బటర్ ను వేసి బటర్ కరిగిన తరువాత పచ్చి మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు, అల్లం ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత టమాట ముక్కలను వేసి కలిపి టమాట ముక్కలు పూర్తిగా వేగే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసి ఇవి అన్నీ చల్లగా అయ్యే వరకు పక్కన ఉంచాలి.
ఇవి చల్లగా అయి తరువాత జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మరో టేబుల్ స్పూన్ బటర్ ను వేసి బటర్ కరిగిన తరువాత బిర్యానీ ఆకు వేసి వేయించాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి కలుపుతూ వేయించుకోవాలి. ఈ మిశ్రమం వేగిన తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి తగినన్ని నీళ్లను పోసి బటర్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తరువాత ముందుగా వేయించిన మీల్ మేకర్ లను, జీలకర్ర పొడిని, ధనియాల పొడిని వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తరువాత ఫ్రెష్ క్రీమ్ ను, మిగిలిన బటర్ ను, గరం మసాలాను వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉండడమే కాకుండా మీల్ మేకర్ వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.