Capsicum Masala Fry : మనకు వివిధ రంగుల్లో లభించే కూరగాయలల్లో క్యాప్సికమ్ కూడా ఒకటి. మనకు క్యాప్సికమ్ ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు, పసుపు, ఆరెంజ్, పర్పుల్ వంటి వివిధ రంగుల్లో లభిస్తుంది. క్యాప్సికమ్ ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. క్యాప్సికమ్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. కీళ్ల నొప్పులను, వాపులను తగ్గించడంలో క్యాప్సికమ్ ఎంతో సహాయపడుతుంది. క్యాప్సికమ్ తో కూడా మనం వంటలను తయారు చేయవచ్చు. క్యాప్సికమ్ తో చేసే వంటలల్లో క్యాప్సికమ్ మసాలా ఫ్రై ఒకటి. దీనిని చాలా సులువుగా, చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. క్యాప్సికమ్ మసాలా ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు.. తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాప్సికం మసాలా ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన క్యాప్సికం – 3 (మధ్యస్థంగా ఉన్నవి), నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన పచ్చి మిర్చి – 2, తరిగిన ఉల్లిపాయ – ఒకటి (పెద్దది), అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, ఎండుకొబ్బరి పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – అర టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
క్యాప్సికం మసాలా ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలిపి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు క్యాప్సికం ముక్కలను, రుచికి తగినంత ఉప్పును వేసి కలిపి క్యాప్సికం పూర్తిగా వేగే వరకు కలుపుతూ వేయించాలి. క్యాప్సికం వేగిన తరువాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఎండు కొబ్బరి పొడిని వేసి కలిపి మరో 3 నిమిషాల పాటు వేయించి, చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం మసాలా ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా క్యాప్సికమ్ వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.
తరచూ క్యాప్సికమ్ ను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పులు తగ్గుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. శరీరంలో ఐరన్ లోపం వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి. చర్మాన్ని, జుట్టును, గోళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో క్యాప్సికం ఎంతో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ క్యాప్సికమ్ ఎంతో ఉపయోగపడుతుంది.