Menthula Pulusu : మెంతులు.. ఇవి మనందరికి తెలిసినవే. మెంతుల్లో ఎన్నో ఔషధ గుణాలు, ఎన్నో పోషకాలు ఉన్నాయి. మెంతులను ఉపయోగించడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ మెంతులను మనం వంటల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. వంటల్లో వాడడంతో పాటు ఈ మెంతులతో మనం ఎంతో రుచిగా ఉండే పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. మెంతుల పులసు చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, బ్యాచిలర్స్ ఇలా ఎవరైనా దీనిని తయారు చేసుకోవచ్చు. మెంతులతో రుచిగా పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతుల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
కారం గల ఎండుమిర్చి – 5, మెంతులు – ఒకటిన్నర టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, కందిపప్పు – ఒకటిన్నర టీ స్పూన్, బియ్యం – ఒక టేబుల్ స్పూన్, చింతపండు – 75 గ్రా., పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 3, కరివేపాకు – రెండు రెమ్మలు, ఇంగువ – పావు టీ స్పూన్.
మెంతుల పులుసు తయారీ విధానం..
ముందుగా చింతపండులో 550 ఎమ్ ఎల్ నీళ్లు పోసి చింతపండు నుండి రసాన్ని తీసుకోవాలి. ఒక కళాయిలో ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, కందిపప్పు వేసి కలుపుతూ ఎర్రగా వేయించాలి. మెంతులు వేగిన తరువాత బియ్యం వేసి వేయించాలి. బియ్యం కూడా చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో చింతపండు రసం, పసుపు వేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలి. చింతపండు రసం ఉడికిన తరువాత మిక్సీ పట్టుకున్న మెంతుల పొడి, ఉప్పు వేసి కలపాలి. ఈ పొడిని ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత ఈ పులుసును కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించాలి.
పులుసు మరీ చిక్కగా ఉంటే కొద్దిగా నీటిని కూడా వేసుకోవచ్చు. పులుసును దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని ముందుగా తయారు చేసుకున్న పులుసులో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మెంతుల పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పులుసులో ఒక టీ స్పూన్ బెల్లం తురుమును కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మెంతులతో పులుసును తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.