Chettinad Onion Pulusu : ఉల్లిపాయలను మనం వంటల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. ఉల్లిపాయలను వాడడం వల్ల వంటల రుచి పెరగడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వంటల్లో ఉపయోగించడంతో పాటు మనం ఉల్లిపాయలతో పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. సాంబార్ ఉల్లిపాయలతో చేసే ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. చెట్టినాడు స్లైల్ లో చేసే ఉల్లిపాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. సాంబార్ ఉల్లిపాయలతో రుచిగా చెట్టినాడు స్టైల్ లో ఉల్లిపాయ కారం పులుసును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చెట్టినాడు ఉల్లిపాయ కారం పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి కొబ్బరి ముక్కలు – పావు కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, మిరియాలు- అర టీ స్పూన్, నూనె – 4 టేబుల్ స్పూన్స్, మెంతులు – పావు టీ స్పూన్, సోంపు గింజలు – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 15, కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన పచ్చిమిర్చి -2, సాంబార్ ఉల్లిపాయలు – 25, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం -ఒకటిన్నర టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – 50 గ్రా., పొడుగ్గా తరిగిన టమాట – 1, నీళ్లు – 350 ఎమ్ ఎల్, బెల్లం తురుము – ఒక టీ స్పూన్, కొత్తిమీర – కొద్దిగా, బటర్ – 2 టీ స్పూన్స్.
చెట్టినాడు ఉల్లిపాయ కారం తయారీ విధానం..
ముందుగా జార్ లో పచ్చి కొబ్బరి ముక్కలు, జీలకర్ర, మిరియాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మెంతులు, సోంపు గింజలు వేసి వేయించాలి. మెంతులను ఎర్రగా వేయించిన తరువాత వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా రంగు మారే వరకు వేయించిన తరువాత ఉల్లిపాయలను వేసి కలపాలి. ఉల్లిపాయలు చక్కగా వేగి రంగు మారిన తరువాత ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారం వేసి కలపాలి. తరువాత చింతపండు రసం వేసి కలపాలి. చింతపండు రసం చక్కగా ఉడికి నూనె పైకి తేలిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి టమాట ముక్కలను మెత్తగా ఉడికించాలి.
టమాట ముక్కలు ఉడికిన తరువాత నీళ్లు పోసి కలపాలి. పులుసు చక్కగా మరిగి ఉడుకు పట్టిన తరువాత బెల్లం తురుము, కొత్తిమీర, ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించిన తరువాత దించే ముందు బటర్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చెట్టినాడు ఉల్లిపాయ కారం పులుసు తయారవుతుంది. దీనిని అన్నం, అట్టు, ఇడ్లీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బటర్ అందుబాటులో లేని వారు ఇందులో నెయ్యిని కూడా వేసుకోవచ్చు. అలాగే సాంబార్ ఉల్లిపాయలు అందుబాటులో లేని వారు సాధారణ ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఉల్లిపాయలతో ఈ విధంగా తయారు చేసిన పులుసును లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.