Minapattu : ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో సహజంగానే చాలా మంది అనేక రకాల వంటలను తయారు చేసుకుని తింటుంటారు. ఇడ్లీ, దోశ, వడ ఇలా చేస్తుంటారు. అయితే మీరు ఎప్పుడైనా పొట్టు మినప పప్పుతో చేసే మినప అట్లను చేసి తిన్నారా.. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. తయారు చేయడం కూడా సులభమే. మినపట్లను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మినపట్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
పొట్టు మినప పప్పు – ఒక గ్లాస్, ఇడ్లీ రవ్వ – మూడు గ్లాసులు, నూనె – రెండు టీస్పూన్లు.
మినపట్లను తయారు చేసే విధానం..
మినప పప్పును రెండు నుంచి మూడు గంటల పాటు నానబెట్టి పొట్టు తీసి రుబ్బుకోవాలి. తరువాత రవ్వను కడిగి తగినంత ఉప్పు వేసి పిండిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని మళ్లీ ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు పక్కన ఉంచాలి. ఇప్పుడు పెనం వేడి చేసి కొద్దిగా నూనె వేయాలి. అది వేడయ్యాక మూడు నాలుగు గరిటెల పిండిని అట్టులా పోయాలి. చిన్న మంట మీద రెండు వైపులా కాల్చి తీయాలి. దీన్ని ఏదైనా ఊరగాయ పచ్చడి లేదా చట్నీతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది.