Miriyala Charu : మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో మిరియాలు కూడా ఒకటి. మిరియాలు చాలా కారంగా, ఘాటుగా ఉంటాయి. వంటల్లో మనం మిరియాలను పొడిగా లేదా వాటిని కచ్చా పచ్చాగా దంచి వేస్తూ ఉంటాం. మిరియాల్లో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. వీటిని ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను మన దరి చేరకుండా చూసుకోవచ్చు. వంటల్లో వాడడంతో పాటు మిరియాలతో మనం ఎంతో రుచిగా ఉండే చారును కూడా తయారు చేసుకోవచ్చు. మిరియాల చారు చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా ఈ చారును సులువుగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఘాటుగా ఉండే మిరియాల చారును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మిరియాల చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, పొడుగ్గా తరిగిన టమాట – 1, నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, ఎండుమిర్చి – 2, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మెంతి గింజలు – 10, ధనియాలు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, నీళ్లు – రెండు గ్లాసులు, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, బెల్లం – ఒక చిన్న ముక్క, మిరియాలు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మిరియాల చారు తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాకవెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత నీళ్లు, చింతపండు రసం, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత మిరియాలను మెత్తగా దంచి వేసుకోవాలి. తరువాత ఈ చారును బాగా మరిగించాలి. చారు చక్కగా మరిగిన తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిరియాల చారు తయారవుతుంది. అన్నంతో కలిపి తింటే ఈ చారు చాలా రుచిగా ఉంటుంది. నోటికి ఏమి తినాలనిపించనప్పుడు, జలుబు, దగ్గు వంటి వాటితో బాధపడుతున్నప్పుడు ఇలా మిరియాల చారును తయారు చేసుకుని తినవచ్చు. ఈ చారును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.