Miriyala Rasam : మన వంట గదిలో ఉండే మసాలా దినుసుల్లో మిరియాలు ఒకటి. వీటిని మనం వంటల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. మిరియాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికి తెలిసిందే. బరువు తగ్గడంలో, శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగిండచంలో, జీర్ణ శక్తి మెరుగుపరచడంలో ఇలా ఎన్నో విధాలుగా మిరియాలు మనకు దోహదపడతాయి. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ మిరియాలతో మనం ఎంతో రుచిగా ఉండే రసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. మిరియాలతో చేసే రసం పుల్ల పుల్లగా ఘాటుగా ఎంతో రుచిగా ఉంటుంది. మిరియాలతో రసాన్ని తయారు చేసుకోవడానికి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అలాగే రసం తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మిరియాల రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
మిరియాల పొడి – అర టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్, ఎండుమిర్చి – 2, ధనియాలు – అర టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, సన్నగా పొడుగ్గా తరిగిన టమాట – 1, నీళ్లు – 2 గ్లాసులు, పసుపు – పావు టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత, ఉప్పు – తగినంత, పుదీనా – కొద్దిగా.
మిరియాల రసం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు , వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి వాటిని మగ్గించాలి. టమాట ముక్కలు మగ్గిన తరువాత నీటిని పోసుకోవాలి. తరువాత ఉప్పు, పసుపు, మిరియాల పొడి, చింతపండు రసం వేసి కలపాలి. ఈ రసాన్ని రెండు పొంగులు వచ్చే వరకు బాగా మరిగించి చివర్లో పుదీనాను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిరియాల రసం తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఇబ్బందిపెడుతున్నప్పుడు ఇలా మిరియాలతో రసాన్ని చేసుకుని తినడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ రసాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. ఈ విధంగా మిరియాలతో రసాన్ని చేసి తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.