Mixed Halwa : మిక్స్డ్ హల్వా.. దీనిని ఎక్కువగా పెళ్లిళ్లల్లో, ఫంక్షన్ లల్లో తయారు చేస్తూ ఉంటారు. ఈ హల్వా చాలా రుచిగా, కమ్మగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఈ హల్వాను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. తీపి తినాలనిపించినప్పుడు ఇలా మిక్స్డ్ హల్వాను తయారు చేసి తీసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత కమ్మగా ఉండే మిక్స్డ్ హల్వాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మిక్స్డ్ హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 150 గ్రా., క్యారెట్ తురుము – అర కప్పు, సొరకాయ తురుము – అర కప్పు, బీట్ రూట్ తురుము – అర కప్పు, తీపి గుమ్మడికాయ తురుము – అర కప్పు, బూడిద గుమ్మడికాయ తురుము – అర కప్పు, చిక్కటి పాలు – 750 ఎమ్ ఎల్, పచ్చికోవా – 100 గ్రా., పంచదార – ముప్పావు కప్పు, తరిగిన బాదంపప్పు – కొద్దిగా, యాలకుల పొడి – ఒక టీ స్పూన్.
మిక్స్డ్ హల్వా తయారీ విధానం..
ముందుగా అడుగు మందంగా ఉండే కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత క్యారెట్ తురుము, బీట్ రూట్ తురుము, సొరకాయ తురుము, తీపి గుమ్మడికాయ తురుము,బూడిద గుమ్మడికాయ తురుము వేసి వేయించాలి. దీనిని చిన్న మంటపై 15 నుండి 18 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. తరువాత చిక్కటి పాలు పోసి మరో 15 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. తరువాత తరువాత పచ్చికొవా వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత పంచదార వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి. హల్వా చక్కగా ఉడికి నెయ్యి పైకి తేలిన తరువాత యాలకుల పొడి, బాదంపప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిక్స్డ్ హల్వా తయారవుతుంది. దీనిని వేడిగా, చల్లగా ఎలా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ హల్వాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.