Mixed Vegetable Kurma : మనం అప్పుడప్పుడూ వివిధ రకాల కూరగాయలను కలిపి మిక్డ్స్ వెజిటేబుల్ కుర్మాను వండుతూ ఉంటాం. ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. మనకు రెస్టారెంట్ లలో కూడా ఈ కూర లభిస్తుంది. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా ఈ కూరను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ కుర్మాను ఎక్కువగా చపాతీ వంటి వాటితో తింటూ ఉంటారు. ఈ మిక్డ్స్ వెజిటేబుల్ కుర్మాను అచ్చం రెస్టారెంట్ లలో లభించే విధంగా క్రీమిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మిక్డ్స్ వెజిటేబుల్ కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – ఒకటిన్నర లీటర్లు, తరిగిన క్యారెట్ – 1, తరిగిన పెద్ద బంగాళాదుంప – 1, తరిగిన ఫ్రెంచ్ బీన్స్ – 6, పెద్దగా తరిగిన క్యాలీప్లవర్ ముక్కలు – 5, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, లవంగాలు – 3, యాలకులు – 3, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, కర్బూజ గింజలు – 2 టీ స్పూన్స్, ఎండు కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ – అర కప్పు, పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, నూనె – పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కరివేపాకు – ఒక రెమ్మ, చింతపండు రసం – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మిక్డ్స్ వెజిటేబుల్ కుర్మా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే క్యారెట్, బంగాళాదుంప, ఫ్రెంచ్ బీన్స్ వేసి ఉడికించాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు వేసి 50 శాతం ఉడికించాలి. ముక్కలు ఉడికిన తరువాత క్యాలీప్లవర్ ముక్కలను వేసి 80 శాతం ఉడికించాలి. తరువాత వీటిని గిన్నెలోకి తీసుకుని చల్లటి నీళ్లు పోసి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో జీడిపప్పు వేసి వేయించాలి. జీడిపప్పు వేగిన తరువాత మసాలా దినుసులు, కర్బూజ గింజలు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఎండు కొబ్బరి పొడి వేసి కలపాలి. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నింటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కరివేపాకు వేసి వేయించాలి.
తరువాత పావు కప్పు నీళ్లు పోసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, చింతపండు రసం వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత 200 ఎమ్ ఎల్ నీళ్లు పోసి కలపాలి. దీనిని 4 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించిన తరువాత ఉడికించిన కూరగాయ ముక్కలు వేసి కలపాలి. దీనిని మరో 4 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిక్డ్స్ వెజిటేబుల్ కర్రీ తయారవుతుంది. దీనిని చపాతీ, రోటి, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వెజిటేబుల్ కుర్మాను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.