Kheer Gulab Jamun : మనం వంటింట్లో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిలో గులాబ్ జామున్స్, అలాగే సేమియా ఖీర్ కూడా ఒకటి. గులాబ్ జామున్స్ అలాగే సేమియా ఖీర్ చాలా రుచిగా ఉంటుంది. వీటిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. అలాగే వీటిని చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. మనం సాధారణంగా ఖీర్ ను, గులాబ్ జామున్స్ ను వేరు వేరుగా తయారు చేసుకుని తింటూ ఉంటాం. కానీ వీటిని వేరు వేరుగా తినడం కంటే ఈ రెండింటిని కలిపి తింటే మరింత రుచిగా ఉంటాయి. ఖీర్ గులాబ్ జామున్ చాలా రుచిగా ఉంటుంది. ఈ కాంబినేషన్ ను అందరూ ఇష్టపడతారు. ఎంతో రుచిగా తిన్నా కొద్ది తినాలనిపించేంత చక్కగా ఉండే ఈ ఖీర్ గులాబ్ జామున్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఖీర్ గులాబ్ జామున్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఖీర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
సేమియా – ఒక కప్పు, పంచదార – ఒక కప్పు, పాలు – 5 కప్పులు, డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, యాలకుల పొడి – అర టీ స్పూన్.
గులాబ్ జామున్ తయారీకి కావల్సిన పదార్థాలు..
గులాబ్ జామున్ మిక్స్ – ఒక కప్పు, పంచదార – ఒక కప్పు, గోరు వెచ్చని పాలు – 120 ఎమ్ ఎల్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఖీర్ గులాబ్ జామున్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గులాబ్ జామున్ మిక్స్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో కొద్ది కొద్దిగా పాలను పోస్తూ కలుపుకోవాలి. పిండిని మెత్తగా కలుపుకుని దానిపై మూతను ఉంచి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో పంచదార, రెండు కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగి జిగురుగా అయ్యే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత చేతికి నెయ్యిని రాసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక గులాబ్ జామున్స్ ను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించి పంచదార పాకంలో వేసుకోవాలి. వీటిని పాకంలో 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల గులాబ్ జామున్స్ తయారవుతాయి. ఇప్పుడు ఖీర్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కళాయిలో నెయ్యివేసి వేడి చేయాలి.
నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో సేమియా వేసి రంగు మారే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో పాలు పోసి వేడి చేయాలి. వీటిని ఒక పొంగు వచ్చే వరకు వేడి చేసిన తరువాత సేమియా వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. సేమియా ఉడికిన తరువాత పంచదార వేసి మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ సేమియాను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ముందుగా తయారు చేసుకున్న జామున్స్ ను వేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఖీర్ గులాబ్ జామున్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.