Moong Dal Chaat : సాయంత్రం సమయంలో చాలా మంది సహజంగానే నూనెతో చేసిన పదార్థాలు లేదా బేకరీ ఫుడ్ ఐటమ్స్‌ను తింటుంటారు. ఇవి వాస్తవానికి మనకు హాని చేస్తాయి. కనుక వాటికి బదులుగా ఆరోగ్యకరమైనవి తీసుకోవాలి. అలాంటి వాటిలో మూంగ్ దాల్ చాట్ ఒకటి. దీన్ని తయారు చేయడం చాలా సులభం. అందుకు పదార్థాలు కూడా పెద్దగా అవసరం లేదు. ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యకరం కూడా. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మూంగ్ దాల్ చాట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసర పప్పు – అర కప్పు, క్యారెట్ తురుము – అర కప్పు, దానిమ్మ గింజలు – అర కప్పు, ఉల్లిపాయలు – తరిగినవి అర కప్పు, పుదీనా – ఒక చిన్న కట్ట, కొత్తిమీర – ఒక చిన్న కట్ట, పచ్చి మిర్చి – రెండు, చాట్ మసాలా – ఒక టీస్పూన్, నిమ్మరసం – నాలుగు టీస్పూన్లు.
మూంగ్ దాల్ చాట్‌ను తయారు చేసే విధానం..
పెసర పప్పును శుభ్రంగా కడిగి మూడు కప్పుల నీళ్లు పోసి కాస్త ఉప్పు వేసి చిన్న మంటపై ఉడికించాలి. బాగా మెత్తగా కాకుండా కాస్త ఉడికిన తరువాత నీళ్లను వంపేసి పప్పును ఒక పాత్రలోకి తీసుకోవాలి. అందులో క్యారెట్ తురుము, దానిమ్మ గింజలు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, పుదీనా, కొత్తిమీర, చాట్ మసాలా, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. సాయంత్రం సమయంలో స్నాక్స్‌గా తీసుకుంటే ఈ చాట్ బాగుంటుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇది ఎంతో ఆరోగ్యకరమైనది. పోషణను అందిస్తుంది. శక్తిని, బలాన్ని ఇస్తుంది. కనుక హానికరైన చిరుతిళ్లకు బదులుగా ఈ చాట్‌ను తయారు చేసుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి రెండింటినీ పొందవచ్చు.