Munakkaya Majjiga Charu : మునక్కాయ.. మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో ఇది కూడా ఒకటి. మునక్కాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మునక్కాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. మునక్కాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మునక్కాయ మజ్జిగ చారు కూడా ఒకటి. మునక్కయాలతో చేసే ఈ మజ్జిగ చారు చాలా రుచిగా ఉంటుంది. వీటిని కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే మునక్కాయ మజ్జిగ చారును సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మునక్కాయ మజ్జిగ చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
మునక్కాయ – 1, పెరుగు – అర కప్పు, పసుపు – అర టీ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, నానబెట్టిన బియ్యం – ఒక టీ స్పూన్, వేయించిన ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
మునక్కాయ మజ్జిగ చారు తయారీ విధానం..
ముందుగా మునక్కాయను కట్ చేసి ముక్కలను కుక్కర్ లో వేయాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత మూత తీసి ముక్కలనను ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత జార్ లో ఎండు కొబ్బరి, బియ్యం, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసి తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకుని కళాయిలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉడికించిన మునక్కాయలు వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
తరువాత చిలికిన పెరుగు, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఈ తాళింపును మజ్జిగ చారులో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మునక్కాయ మజ్జిగ చారు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. మునక్కాయతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా మజ్జిగ చారును కూడా తయారు చేసుకుని తినచ్చు. ఈ మజ్జిగ చారును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.