Murmura Mixture : బియ్యంతో చేసే మరమరాలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఈ మరమరలాతో ఎక్కువగా ఉగ్గాణీని, మిక్చర్ వంటి వాటిని తయారు చేస్తారు. మరమరాలతో చేసే మిక్చర్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఇది మనకు బయట ఎక్కువగా దొరుకుతుంది. ఈ మరమరాల మిక్చర్ ను మనం చాలా సులభంగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. రుచిగా మరమరాల మిక్చర్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మరమరాల మసాలా మిక్చర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మరమరాలు – రెండు పెద్ద కప్పులు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, పల్లీలు – అర కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు – 4 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – రెండు రెమ్మలు, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, వేయించిన జీలకర్ర పొడి – అర టీ స్పూన్, పంచదార పొడి – ఒక టీ స్పూన్.
మరమరాల మసాలా మిక్చర్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పసుపును వేసి కలపాలి. తరువాత మరమరాలను వేసి అంతాకలిసేలా బాగా కలపాలి. తరువాత మరో రెండు టీ స్పూన్ల నూనె వేసి కలపాలి. ఈ మరమరాలను కరకరలాడే వరకు వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యక పల్లీలు వేసి కరకరలాడే వరకు వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.అలాగే ఎండుకొబ్బరి ముక్కలు, కరివేపాకు కూడా వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు వేయించిన మరమరాలలో వేయించిన పల్లీలు, ఎండు కొబ్బరిముక్కలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, పంచదార పొడి వేసి కలపాలి. చివరగా కరివేపాకును వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మరమరాల మిక్చర్ తయారవుతుంది. సాయంత్రం స్నాక్స్ గా, ప్రయాణాలు చేసేటప్పుడు ఇలా మరమరాల మిక్చర్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారు.