Mushroom Pulao : మనం ఆహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో పుట్ట గొడుగులు కూడా ఒకటి. ఇవి ఎక్కువగా మనకు వర్షాకాలంలో మాత్రమే దొరికేవి. కానీ ప్రస్తుతం ఇవి కాలంతో సంబంధం లేకుండా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. వీటిని తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో, రక్త హీనత సమస్యను నయం చేయడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ పుట్ట గొడుగులతో మనం రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా పుట్టగొడుగులతో ఎంతో రుచిగా ఉండే పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పుట్ట గొడుగుల పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బాస్మతి బియ్యం – ఒక గ్లాస్, తరిగిన పుట్ట గొడుగులు – 200 గ్రా., నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, జాపత్రి – 1, అనాస పువ్వు – 1, లవంగాలు – 3, యాలకులు – 3, నల్ల యాలక్కాయ – 1, మరాఠీ మొగ్గలు – 2, దాల్చిన చెక్క – 2 , సాజీరా – ఒక టీ స్పూన్, సోంపు గింజలు – అర టీ స్పూన్, బిర్యానీ ఆకులు – 2, పొడుగ్గా తరిగిన పచ్చి మిర్చి – 2, పొడుగ్గా సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, బిర్యానీ మసాలా పొడి – ఒక టీ స్పూన్, గుజ్జుగా చేసిన టమాట – 1, పెరుగు – పావు కప్పు, ఉప్పు – తగినంత, తరిగిన పుదీనా – కొద్దిగా, తరిగిన కొత్తిమీర- కొద్దిగా, నీళ్లు – ఒకటిన్నర గ్లాస్.
పుట్ట గొడుగుల పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి , నూనె వేసి అవి వేడయ్యాక మసాలా దినుసులను వేసి వేయించుకోవాలి.ఇవి వేగిన తరువాత పచ్చి మిర్చిని, ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా అయిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత పసుపు, కారం, బిర్యానీ మసాలా వేసి నిమిషం పాటు వేయించాలి. తరువాత టమాట గుజ్జును వేసి కలిపి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత పెరుగును వేసి కలిపి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత తరిగిన పుట్ట గొడుగులతోపాటు ఉప్పును కూడా వేసి కలపాలి.
పుట్ట గొడుగులలోని నీరు అంతా పోయి నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత పుదీనాను, కొత్తిమీరను వేసి కలపాలి. తరువాత నీటిని పోసి కలిపి మధ్యస్థ మంటపై నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి కలిపి మూత పెట్టి మంటను పెంచుతూ తగ్గిస్తూ 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పట్టగొడుగుల పులావ్ తయారవుతుంది. దీనిని రైతాతో లేదా మసాలా కూరలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పుట్ట గొడుగులతో పులావ్ ను చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.