Mutton Chukka : ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో మటన్ కూడా ఒకటి. నాన్ వెజ్ ప్రియులకు దీని రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మటన్ ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మనం మటన్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. అయితే తరచూ ఒకేరకం మనట్ వెరైటీలను తిని తిని బోర్ కొట్టిన వారు ఇప్పుడు చెప్పే విధంగా మటన్ చుక్కాను కూడా తయారు చేసుకుని తినవచ్చు. మటన్ చుక్క చాలా రుచిగా ఉంటుంది. చెట్టినాడు సాంప్రదాయ వంటకమైన ఈ మటన్ చుక్కాను తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మటన్ చుక్కాను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ చుక్క తయారీకి కావల్సిన పదార్థాలు..
మటన్ – అరకిలో, ఉప్పు – తగినంత, లవంగాలు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, పసుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు -ఒక గ్లాస్, తరిగిన ఉల్లిపాయలు – 4, కరివేపాకు -ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
మిరియాలు – 2 టీ స్పూన్స్, ఎండుమిర్చి – 5, లవంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర -ఒక టీ స్పూన్, సోంపు గింజలు – అర టీ స్పూన్, యాలకులు – 3.
మటన్ చుక్క తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో శుభ్రంగా కడిగిన మటన్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నీళ్లు, నూనె వేసి మూత పెట్టి 6 నుండి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో మసాలా పొడికి కావల్సిన పదార్థాలు వేసి దోరగా వేయించాలి. వీటిని చిన్న మంటపై దోరగా వేయించిన తరువాత జార్ లోకి తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత ఉడికించిన మటన్ ను నీటితో సహా వేసుకోవాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ నీరంతా పోయే వరకు ఉడికించాలి. మటన్ కొద్దిగా దగ్గర పడిన తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలిపి ఉడికించాలి. మటన్ పూర్తిగా దగ్గర పడిన తరువాత కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ చుక్క తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.